ట్విట్టర్‌ రెక్కలు కత్తిరిస్తారా? | Central has thinking to take action against leftist ideological tweets | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌ రెక్కలు కత్తిరిస్తారా?

Feb 14 2019 2:31 AM | Updated on Feb 14 2019 7:59 AM

Central has thinking to take action against leftist ideological tweets - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌ రెక్కలు కత్తిరించాలని కేంద్రం భావిస్తోందా? ట్విట్టర్‌ గ్లోబల్‌ బృందం సీనియర్‌ సభ్యులు లేదా సీఈవో తమ ముందు హాజరైతే తప్ప ఇతర అధికారులెవరినీ కలవబోమని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించడంతో ఈ అనుమానం తలెత్తుతోంది. తమ ఆదేశాలు పాటించి తమ ముందు హాజరుకావడానికి ట్విట్టర్‌కు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చారు. ఈ నెల మొదట్లో ‘యూత్‌ ఫర్‌ సోషల్‌ మీడియా డెమోక్రసీ’పేరుతో బీజేపీ సానుభూతిపరులైన వారి బృందం ట్విట్టర్‌ ఇండియా కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరిపింది. తర్వాత వామపక్షేతర సిద్ధాంతాలు అనుసరించే వ్యక్తుల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడానికి ట్విట్టర్‌ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌కు వినతిపత్రం సమర్పించింది. వామపక్ష భావజాలం వైపు మొగ్గుచూపే అకౌంట్ల నుంచి చేసే నిందాపూర్వక ట్వీట్ల విషయంలో ట్విట్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. 

తగ్గిన మోదీ ఫాలోవర్లు.. 
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కు 32 కోట్లకు పైగా ఖాతాలుండగా, ఇండియాలో 3 కోట్ల మంది వినియోగదారులున్నారు. కానీ నకిలీ ఖాతాలను నవంబర్‌లో ట్విట్టర్‌ రద్దు చేయడంతో దేశంలో వినియోగదారుల సంఖ్య 2.4 కోట్లకు తగ్గింది. ఫేక్‌ అకౌంట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఫాలోవర్లు గణనీయంగా తగ్గారు. 

వాడుకుంది వారే.. 
ట్విట్టర్‌ను మొదట్నుంచీ బీజేపీ మద్దతుదారులే బాగా వాడుకున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ప్రధాని నరేంద్రమోదీ 2009లో ట్విట్టర్‌ ద్వారా అభిప్రాయాలు పంచుకోవడం ప్రారంభించారు. మిగిలిన పార్టీల నేతలూ ఆయనను అనుసరించారు. 2014 ఎన్నికల తర్వాత ట్విట్టర్‌ వినియోగంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా మోదీని అందుకునే స్థాయికి చేరుకున్నారు. అయినా బీజేపీ మద్దతుదారులదే ట్విట్టర్‌లో ఆధిపత్యం కొనసాగింది. ఆలస్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఆటలో మోదీ, బీజేపీ శిబిరానికి గట్టి పోటీదారుగా అవతరించారు. ఇటీవల రఫేల్‌ కుంభకోణంలో ట్విట్టర్‌ను ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’అక్రమ పద్ధతిలో తన ప్రచారానికి వాడుకుంటోందని బీజేపీ ఆరోపించింది. గతంలో ఆయుధంగా ఉపయోగపడిన ట్విట్టర్‌ నేడు పాలకపక్షానికి కంటగింపుగా మారింది. 

‘రాజకీయ అభిప్రాయాల ఆధారంగా చర్యలుండవు’
‘నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే నమ్మకం ఉన్నవారే ట్విట్టర్‌ను నడుపుతున్నారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోం’అని ఇటీవల ట్విట్టర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాలిన్‌ క్రోవెల్‌ తన బ్లాగ్‌లో స్పష్టం చేశారు. వాస్తవానికి దేశాన్ని బట్టి లేదా రాజకీయ పార్టీని బట్టి ట్విట్టర్‌ ఎలాంటి విధానం రూపొందించలేదు. ట్విట్టర్‌ మీడియా సంస్థా? లేదా సామాజిక వేదికా.. అనే విషయం పరిశీలించాలని కేంద్ర సమాచార శాఖను ఠాకూర్‌ నేతృత్వంలోని ఐటీ కమిటీ కోరింది. మీడియా సంస్థగా నమోదైతే ఇండియాలో విదేశీ మీడియా సంస్థలకు వర్తించే కఠిన నిబంధనలు ట్విట్టర్‌ను ఇబ్బంది పెడతాయి. సామాజిక వేదికగా తేలితే వినియోగదారులు వెలిబుచ్చే అభిప్రాయాలను ఎడిట్‌ చేయడం చట్ట వ్యతిరేకమవుతోంది. ఏ రకంగా చూసినా ట్విట్టర్‌కు కష్టాలు తప్పవు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement