మరో వారం పాటు సమావేశాలు! | parliament budget 1st term sessions will extend one week | Sakshi
Sakshi News home page

మరో వారం పాటు సమావేశాలు!

Mar 20 2015 3:36 AM | Updated on Sep 2 2017 11:06 PM

మరో వారం పాటు సమావేశాలు!

మరో వారం పాటు సమావేశాలు!

బొగ్గు, ఖనిజాల బిల్లులు శుక్రవారం రాజ్యసభ ఆమోదం పొందని పక్షంలో పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాలను మరో వారం పాటు పొడిగించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది.

* బొగ్గు, ఖనిజాల బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందని పక్షంలో.. ప్రభుత్వ యోచన
న్యూఢిల్లీ: బొగ్గు, ఖనిజాల బిల్లులు శుక్రవారం రాజ్యసభ ఆమోదం పొందని పక్షంలో పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాలను మరో వారం పాటు పొడిగించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. గురువారం జరిగిన రాజ్యసభ బీఏసీ భేటీలో ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. తమ ఆమోదం లేకుండా సమావేశాలను పొడిగించడం సరికాదని విపక్షం.. సమావేశాలను పొడిగించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అధికార పక్షం వాదించాయి. బొగ్గు.. గనులు, ఖనిజాల బిల్లులు బుధవారమే సభలో ప్రవేశపెట్టినందున వాటిపై చర్చకు మరింత సమయం అవసరమని బీఏసీలో కాంగ్రెస్ వాదించగా.. అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలైన ఎస్పీ, జేడీయూ, టీఎంసీ, డీఎంకే, అన్నాడీఎంకే, బీఎస్పీ, ఎన్డీయే మిత్రపక్షం టీడీపీలు మాత్రం శుక్రవారమే వాటి విషయం తేలాలని పట్టుబట్టాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
 
మరోవైపు,  ప్రస్తుత పరిస్థితుల్లో భూ సేకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం అసాధ్యమని అర్థమైన నేపథ్యంలో దాన్ని సభలో ప్రవేశపెట్టకపోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అయితే, భూ సేకరణ బిల్లు గురించి ఏ నిర్ణయం తీసుకోలేదని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీఏసీ భేటీలో ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. భూ సేకరణ ఆర్డినెన్స్ కాలపరిమితి ఏప్రిల్ 5న ముగియనుంది. అందువల్ల ఈ లోపే, అంటే ఈ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఒకవేళ ఈ సమావేశాల్లో భూ బిల్లు ఆమోదం పొందని పక్షంలో సమావేశాలను ప్రోరోగ్ చేసి, తాజాగా అదే ఆర్డినెన్సును మరోసారి జారీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో ఇలా ఒక్కో ఆర్డినెన్సు నాలుగైదు సార్లు జారీ అయిన సందర్భాలున్నాయని పేర్కొంటోంది.
 
నేడు లోక్‌సభకు నల్లధనం బిల్లు!
నల్లధనం సమస్యను పరిష్కరించే దిశగా రూపొందించిన బిల్లును ప్రభుత్వం, బడ్జెట్ తొలివిడత సమావేశాల చివరిరోజైన శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. అక్రమంగా విదేశాల్లో డబ్బును దాచినవారికి పదేళ్లవరకూ కఠిన కారాగారశిక్ష విధించే ప్రతిపాదనలను.. ‘వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల బిల్లు-2015’లో చేర్చారు. అలాగే, విదేశాల్లోని తమ అక్రమ ఆస్తులను వెల్లడించి, పన్నులు, జరిమానా చెల్లించిన వారికి జైలు శిక్షను తప్పించే ప్రతిపాదనను కూడా అందులో చేర్చారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశముంది. కాగా, నౌకాశ్రయాలకు సంబంధించి కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి గడ్కారీ తెలిపారు.
 
నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేసేందుకే..

ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేసే ఉద్దేశంతో తీసుకుందేనని కాంగ్రెస్ విమర్శించింది. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్ సభ్యుడు బాలచంద్ర ముంగేకర్.. ఈ మేరకు పేర్కొన్నారు. కాగా, ద్రవ్యవినిమయ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
 
రైతులను ఉదారంగా ఆదుకుంటాం - కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: అకాల వర్షాలు, వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సాంకేతిక అంశాల జోలికి వెళ్లకుండా ఉదారంగా సాయం చేస్తామని తెలిపింది. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల్లో అకాల వర్షాలతో జరిగిన పంటనష్టంపై గురువారం రాజ్యసభలో చర్చ జరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయినందున వారి రుణాలను రద్దు చేయాల్సిందిగా పార్టీలకతీతంగా సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంటనష్టాలను అంచనా వేసేందుకు ఇప్పటికే వ్యవసాయ మంత్రి రాష్ట్రానికో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని, ముగ్గురు కేంద్రమంత్రులు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారని వివరించారు. తొలుత జేడీయూ సభ్యుడు కేసీ త్యాగి చర్చను ప్రారంభిస్తూ.. అకాల వర్షాలకు రూ.22 వేల కోట్ల పంట నష్టం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement