
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై పాక్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ కుటుంబసభ్యులతో పాక్ అత్యంత అమానవీయంగా, దారుణంగా వ్యవహరించిందని భారత్ విమర్శించింది. జాధవ్‌ను కలుసుకోవడానికి వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతనల సంప్రదాయాలను, భావోద్వేగాలను అవమానించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. కుటుంబసభ్యులపై పాక్ తీరును గర్హిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పార్లమెంటు ఉభయసభల్లో ఒక ప్రకటన చేశారు.
‘భద్రత పేరుతో అక్కడి అధికారులు జాధవ్ తల్లి అవంతి, భార్య చేతన ధరించిన తాళి, గాజులు, బొట్టు బలవంతంగా తీసేయించారు. కెమెరాలు, చిప్‌లు ఉన్నాయనే అనుమానంతో చేతన ధరించిన చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారు. చీర బదులు సల్వార్‌కమీజ్ ధరించాలంటూ జాధవ్ తల్లిని బలవంతపెట్టారు. మంగళసూత్రం, బొట్టు, గాజులు తీయించడం ఎంత అమానవీయం. భారతీయ మహిళకు ఇంతకంటే అవమానం ఇంకేదైనా ఉంటుందా?’ అని ఆవేదనగా ప్రశ్నించారు. జాధవ్ చాలా అలసిపోయినట్లుగా, వ్యాకులతతో కనిపించారని కుటుంబసభ్యులు తెలిపారన్నారు.
తల్లితో మాతృభాష మరాఠీలో కూడా మాట్లాడనివ్వలేదన్నారు. దీనిపై ఆ దేశ అధికారులకు తీవ్ర నిరసన తెలిపామన్నారు. జాధవ్‌పై పాక్ చేసిన ఆరోపణలను తప్పని నిరూపించి అతన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. గూఢచర్యం ఆరోపణలతో జాధవ్‌ను నిర్బంధించిన పాకిస్తాన్ అతడికి మరణశిక్ష విధించింది. ప్రస్తుతం ఈ అంశం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం తల్లి, భార్యకు ఇస్లామాబాద్‌లోని అత్యంత భద్రత ఉండే విదేశాంగ శాఖ కార్యాలయంలో మాట్లాడే అవకాశం ఇచ్చింది.
హెగ్డే క్షమాపణలు..
లౌకికవాదులు, రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలుపుతూ గురువారం కేంద్ర మంత్రి హెగ్డే లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ‘కర్ణాటకలో నేను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించారు. రాజ్యాంగంపై, బీఆర్ అంబేద్కర్‌పై నాకు ఎంతో గౌరవం. నా వ్యాఖ్యలతో ఎవరైనా మనస్తాపం చెందితే వారికి క్షమాపణ చెబుతున్నా’ అంటూ ముగించారు. అయితే, హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం కొనసాగింది. మంత్రి హెగ్డే లోక్‌సభలో క్షమాపణ చెప్పారని, ఆందోళనలు విరమించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్ గోయెల్ కోరినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. చివరికి ఆందోళనల మధ్యే సభ శుక్రవారానికి వాయిదాపడింది.
నాన్న ఎలా ఉన్నారు?
మంగళసూత్రం, బొట్టు, గాజులు లేకుండా వచ్చిన తల్లిని చూడగానే జాధవ్ ఆందోళనకు గురయ్యారని, ‘అమ్మా.. నాన్నకేమయింది’ అని ఆత్రుతగా అడిగారని అవంతి తనతో అన్నారని సుష్మా చెప్పారు. భద్రత పేరుతో ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. ‘భావోద్వేగాలకు సంబంధించిన అంశాన్నీ పాక్ కుట్రపూరితంగా, ఒక ప్రచారాస్త్రంగా మలిచింది. వారి దుశ్చర్యలను వివరించేందుకు మాటల్లేవు’ అన్నారు. ఒకవేళ షూస్‌లో రికార్డర్ లేదా చిప్ ఉంటే ఢిల్లీ, దుబాయ్, పాకిస్తాన్ విమానాశ్రయాల్లో తనిఖీల సందర్భంగా బయటపడేవి కావా? అని సుష్మా ప్రశ్నించారు.