పంజాబ్‌లో ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల అరెస్ట్‌​

Pakistan Drones Flew Low And Dropped Weapons With 8 Sorties In Punjab - Sakshi

చంఢీఘర్‌ : పంజాబ్‌లోని తార్న్‌ తారన్‌ జిల్లాలో ఖలిస్తాన్‌ జిందాబాద్‌ ఫోర్స్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను సోమవారం పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన ఆయుధాలు, పెద్ద ఎత్తున నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో రిజిస్ట్రేషన్‌ అయిన మారుతీ స్విఫ్ట్‌ కారులో అమృత్‌సర్‌కు వెళుతున్న బల్వంత్‌ సింగ్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, హర్బజన్‌ సింగ్‌, బల్బీర్‌ సింగ్‌పై అనుమానం​ వచ్చి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరిలో ఆకాశ్‌దీప్‌ సింగ్‌, బల్వంత్‌ సింగ్‌లపై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు.

కాగా, ఈ వాదనలకు బలం చేకూరుస్తూ.. జమ్మూ-కశ్మీర్‌లో మరోసారి భయాందోళనను సృష్టించేందుకు పాకిస్తాన్‌, భారత్‌ సరిహద్దులో ఉన్న అమృత్‌సర్‌లో డ్రోన్ల ద్వారా ఎకె-47, గ్రనైడ్లను వదిలివెళ్లినట్లు సమాచారం అందిందని పంజాబ్‌ పోలీసులు నిర్దారించారు. కేవలం నెల వ్యవధిలోనే 8 డ్రోన్ల ద్వారా ఆయుధాలతో పాటు సాటిలైట్‌ ఫోన్లను భారతగడ్డపై వదిలివెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ఈ డ్రోన్లు అత్యంత వేగంగా ఎగురుతూ 5 కేజీల బరువును సలువుగా మోస్తాయని, సమాచారాన్నివేగంగా  పసిగడతాయని వెల్లడించారు.

అలాగే వారిని అదుపులోకి తీసుకున్న ప్రదేశంలో సగం కాలిపోయిన డ్రోన్‌ దొరికిందని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే సమయంలో డ్రోన్‌లో ఇబ్బంది తలెత్తడంతో ఉగ్రవాదులే దానిని కాల్చడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. గత ఆగస్టులో ఇదే తరహాలో పంజాబ్‌కు చెందిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ టీం అమృత్‌సర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థను కోరినట్లు పంజాబ్‌ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కల్పించుకొని వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top