మన సౌర కుటుంబానికి జోడీ దొరికింది!

Our solar family has got a pair! - Sakshi

 కెప్లర్‌ 90 సౌరవ్యవస్థలో 8 గ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు 

సౌర కుటుంబానికి ఆవల గ్రహాలను గుర్తించడం కొత్తేమీ కాదు. 1995లోనే సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహాన్ని గుర్తించారు.  భూమిని పోలిన గ్రహాలను గుర్తించేందుకు నాసా 2009లో కెప్లర్‌ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. నాలుగేళ్లలో 35 వేల గ్రహాల ఉనికిపై కెప్లర్‌ సంకేతాలిచ్చింది. కెప్లర్‌ సమాచారాన్ని విశ్లేషించేం దుకు గూగుల్‌ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌తో 2 కొత్త గ్రహాల సమాచారం తెలిసింది. 

కృత్రిమ మేధతో గుర్తింపు..
కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రహాలను  గుర్తించేందుకు ‘గ్రావిటీ లెన్సింగ్‌’అనే పద్ధతిని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు. ప్రకాశవంతమైన నక్షత్రం ముందు నుంచి గ్రహం వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వెలుగు కొంచెం తగ్గుతుంది. ఈ తగ్గుదలను బట్టి అక్కడ గ్రహం ఉందా లేదా.. ఉంటే దాని సైజు వివరాలు తెలుసుకుంటారు. తగ్గే వెలుతురు అతి సూక్ష్మంగా ఉంటే వాటిని గుర్తించేందుకు నాసా కృత్రిమ మేధ సాయం తీసుకుంది. కెప్లర్‌ టెలిస్కోప్‌ సేకరించిన సమాచారంతో గ్రహాల ఉనికిని గుర్తించడం ఎలా అన్న అంశంపై దీనికి శిక్షణ ఇచ్చారు. అప్పటికే గుర్తించిన 15,000 గ్రహాల సమాచారాన్ని అందించి.. కృత్రిమ మేధ పనిచేస్తోందా లేదా అనేది నిర్ధారించుకున్నారు. బలహీనమైన సంకేతాలున్న 670 గ్రహ వ్యవస్థల సమాచారాన్ని కంప్యూటర్‌కు ఫీడ్‌ చేశారు. దాన్ని  పరిశీలించిన కంప్యూటర్‌.. కెప్లర్‌ 90, కెప్లర్‌ 80 గ్రహ వ్యవస్థల్లో ఒక్కో కొత్త గ్రహం ఉన్నట్లు గుర్తించింది. కెప్లర్‌ 90లో 7 గ్రహాలను ఇప్పటికే గుర్తించారు. తాజాగా గుర్తించిన గ్రహంతో 8  ఉన్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహ వ్యవస్థలో 7 గ్రహాలతో ట్రాపిస్ట్‌–1 మొదటి స్థానంలో ఉందన్నారు.

కెప్లర్‌ 90ఐ ప్రత్యేకతలు: కెప్లర్‌ 90 గ్రహ వ్యవస్థ భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 90 ఐ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఒక సారి తిరిగేందుకు 14.4 రోజులు తీసుకుంటుంది.  దీని ద్రవ్యరాశి భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ. గ్రహం మొత్తమ్మీద ఉండే ఉష్ణోగ్రత  436 డిగ్రీల సెల్సియస్‌  ఉంటుంది.     
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top