హజ్ యాత్ర దరఖాస్తుల ప్రక్రియను కేంద్రం తొలిసారిగా డిజిటలైజేషన్ చేసింది.
ముంబై: హజ్ యాత్ర దరఖాస్తుల ప్రక్రియను కేంద్రం తొలిసారిగా డిజిటలైజేషన్ చేసింది. దీనికి సంబంధించిన యాప్‌ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ ఇక్కడి హజ్ హౌస్‌లో ఆవిష్కరించారు. యాత్ర వివరాలు, ఈ–పేమెంట్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఇది పెద్ద అడుగని నఖ్వీ చెప్పారు.
‘వచ్చే హజ్ యాత్ర నుంచి కేంద్రం ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రోత్సహించనుంది. దీనివల్ల యాత్ర మరింత సౌకర్యవంతంగా, ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది’అని ఆయన వెల్లడించారు. గూగుల్ ప్లేస్టోర్‌లో ‘హజ్ కమిటీ ఆఫ్ ఇండియా’ మొబైల్ యాప్ సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24. ఐదుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఒక గ్రూప్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు.