దోషిగా ఆరేళ్లు.. నిర్దోషిగా 15 ఏళ్లు | Sakshi
Sakshi News home page

దోషిగా ఆరేళ్లు.. నిర్దోషిగా 15 ఏళ్లు

Published Tue, Mar 20 2018 2:42 PM

Once Convicted And Now Trace Accused - Sakshi

న్యూఢిల్లీ : మన దేశ జనాభాకు తగ్గట్టుగా కోర్టుల సంఖ్య లేదననేది వాస్తవం. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కేసుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. అందుకు న్యాయస్థానాలు, న్యాయవాదుల సంఖ్య ఓ కారణమైతే సరైన సమయంలో స్పందించకుండా తప్పించుకు తిరిగే పౌరులు కూడా మరో కారణం. అదే కోవలో మధ్యప్రదేశ్‌ పోలీసులకు చిక్కకుండా మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతూ, కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నాడు ఓ నేరస్తుడు.

మధ్యప్రదేశ్‌కు చెందిన భోలా మహర్‌ 1993లో ఓ హత్య కేసులో గ్వాలియర్‌ కోర్టు అతన్ని 1999లో దోషిగా నిర్దారించింది. ఆరేళ్ల శిక్ష అనంతరం అతను మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద, సరైన ఆధారాలు లేవనే కారణంతో అతనికి కేసు నుంచి విముక్తి లభించింది. అయితే 2015లో మహర్‌ను నిర్దోషిగా ఎలా నిర్దారించారో చెప్పాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అప్పీలు స్వీకరించిన సుప్రీం కోర్టు జులై 10, 2015న మహర్‌కు నోటీసులు జారీ చేసింది. అప్పటినుంచి ఈ మూడేళ్లలో కేసు ఐదుసార్లు విచారణకు వచ్చింది. కానీ మహర్‌ నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. అతని ఆచూకీ కనుక్కోవటంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలం కావటంతో పాత కథే పునరావృతమైంది. దీంతో కేసులో భాగమైన ప్రతివాది స్పందించలేదనే కారణంతో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తామని సర్వోన్నత న్యాయస్ధానం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఎస్పీని ఆదేశించింది.

Advertisement
Advertisement