నందాదేవి.. ఓ మిస్టరీ! 

Nuclear threat posed in the Himalayas - Sakshi

హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు 

ఆ పరికరాలేంటి?

8 నుంచి 10 అడుగులు ఉన్న ఏంటెనా 

రెండు ట్రాన్స్‌ రిసీవర్‌ సెట్స్‌ 

న్యూక్లియర్‌ జనరేటర్‌  

ఏడు ప్లుటోనియం క్యాప్సూల్స్‌ 

పరికరాల బరువు 56 కేజీలు

ఐదు దశాబ్దాల క్రితం జరిగిన ఒక సీక్రెట్‌ ఆపరేషన్‌ ఇప్పుడు మన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనాపై నిఘా పెట్టడానికి హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణులకు తరలించిన అణు పరికరం.. భవిష్యత్తులో ఏం ప్రకంపనలు రేపుతుందోనని గుబులు రేపుతోంది. మంచులో కూరుకుపోయిన దాని జాడ పసిగట్టేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. మరోవైపు ఆ సీక్రెట్‌ ఆపరేషన్‌ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. అసలు అప్పుడేం జరిగింది ? మనకు పొంచి ఉన్న ముప్పేంటి ?  

53 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే...
అది 1964 సంవత్సరం. చైనా తొలిసారిగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు ముఖ్యంగా పెద్దన్న అమెరికాకు దడ పుట్టించింది. దీంతో చైనా అణుపాటవం తెలుసుకోవడానికి హిమాలయాల్లో సెన్సార్లు ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది. దీనికి భారత్‌ సహకారం కోరింది. అనాలోచితంగా భారత్‌ దీనికి అంగీకరించింది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ), భారత్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) సంయుక్తంగా చైనా అణుకార్యకలాపాలపై హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణుల నుంచి నిఘా పెట్టడానికి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలకు చెందిన సిబ్బంది అణు ఇంధనంతో నడిచే జనరేటర్, ప్లుటోనియం క్యాప్సూల్స్, ఏంటెనాలు ఏర్పాటు చేయడానికి 1965 జూన్‌ 23న అలాస్కాలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

ఆ తర్వాత అక్టోబర్‌లో నందాదేవి శ్రేణులకు వెళ్లారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జనరేటర్, క్యాప్సూల్స్‌ను అక్కడే విడిచి వచ్చేశారు. వాతావరణం చక్కబడ్డాక తిరిగి వెళ్లి చూస్తే అవి అక్కడ కనిపించలేదు. ఎక్కడో మంచులో కూరుకుపోయా యి. వాటిని అలాగే వదిలేస్తే ప్రమాదం ఉంటుందని భావించిన ఈ బృందం తిరిగి 1966, 67లలో కూడా హిమాలయాలకు వెళ్లి వాటి కోసం విస్తృతంగా గాలించాయి. కానీ లాభం లేకుండా పోయింది. అవెక్కడున్నాయో కనిపెట్టలేకపోయారు. అది రహస్య ఆపరేషన్‌ కావడంతో చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు. అయితే అప్పట్లో భారత్‌ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్‌ మన్మోహన్‌సింగ్‌ కోహ్లి మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడాయనకు 88 ఏళ్లు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున పరికరాల జాడ కనిపెట్టాలంటున్నారు.

క్యాప్సూల్స్‌తో ప్రమాదం ఎలా ? 
ప్లుటోనియం క్యాప్సూల్స్‌ జీవితకాలం వందేళ్లు. ఆ తర్వాత అవి కరిగిపోతాయి. ఇప్పటికే 53 ఏళ్లు గడిచిపోగా మరో 47 ఏళ్లే మిగిలి ఉంది.

గంగానదికి అణు ముప్పు 
ప్లుటోనియం క్యాప్సూల్స్‌ ఒకవేళ కరిగిపోయి రిషి గంగలో కలిస్తే పవిత్ర జలాలన్నీ కలుషితమైపోతాయి. ఆ నీటిని వినియోగిస్తే ఎందరో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు ఉన్న ప్రజలు రేడియేషన్‌ బారినపడే అవకాశం ఉంది. 

ఇప్పుడేం చేస్తారు? 
ఉత్తరాఖండ్‌ పర్యాటక మంత్రి సత్పల్‌ మహరాజ్‌ ఇటీవల ప్రధాని మోదీని కలిసి గంగానదికి ఉన్న అణుముప్పు గురించి వివరించారు. ప్లుటోనియం క్యాప్సూల్స్‌ను వెలికితీయకపోతే 40ఏళ్ల తర్వాత పెను ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాడార్లు, సెన్సార్ల ద్వారా 10–15 అడుగుల లోతైన మంచు పొరలను తొలిచి ఆ పరికరాల జాడ కనుగొనాలని కోరారు. ఇందుకు కేంద్రం ఓకే చెప్పింది. 

తెరకెక్కనున్న హాలీవుడ్‌ సినిమా... 
స్మోక్‌ సిగ్నల్స్, హోమ్‌ ఎలోన్‌ వంటి చిత్రాలను నిర్మించిన హాలీవుడ్‌ నిర్మాత స్కాట్‌ రోజెన్‌ఫెల్ట్‌ని ఈ సీక్రెట్‌ మిషన్‌ విపరీతంగా ఆకర్షించింది. కెప్టెన్‌ కోహ్లి ఈ ఆపరేషన్‌పై స్పైస్‌ ఇన్‌ హిమాలయాస్‌ పేరుతో చాలా ఏళ్ల కిందటే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం హక్కుల్ని రోజెన్‌ఫెల్ట్‌ పదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కానీ బడ్జెట్‌ సరిపోక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మలబెర్రి ఫిలిమ్స్, రోజెన్‌ఫెల్ట్‌ సంయుక్తంగా 2 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీక్రెట్‌ ఆపరేషన్‌లో పాల్గొన్న పలువురిని రోజెన్‌ఫెల్ట్‌ కలసి వారు చెప్పిన అనుభవాలతో ఆపరేషన్‌ నందాదేవిని తెరకెక్కిం చనున్నారు. భారత్‌ సిబ్బంది పాత్రల్లో భారతీయులనే తీసుకోనున్నారు. కెప్టెన్‌ కోహ్లి పాత్రకు 
రణబీర్‌ను సంప్రదించినట్టు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top