కల్లోలం నుంచి క్రమంగా.. 148 ఎఫ్‌ఐఆర్‌లు

 North East Delhi Riots: Death Toll Rises To 42 - Sakshi

తేరుకుంటున్న ఈశాన్య ఢిల్లీ

శుక్రవారం ప్రశాంతం

42కి చేరిన అల్లర్ల మృతుల సంఖ్య

ఢిల్లీ సీపీగా శ్రీవాస్తవ 

న్యూఢిల్లీ: వారం ప్రారంభంలో అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు శుక్రవారం ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి, నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు విధులకు వెళ్లడం ప్రారంభించారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా భద్రతాదళాలు అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘాను పెట్టాయి. మసీదుల్లో మౌల్వీలు శాంతి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వదంతులకు, తప్పుడు వార్తలకు స్పందించవద్దని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు ప్రకటించారు. అయితే, చెత్త, వ్యర్థ వస్తువులను ఏరుకునేందుకు శుక్రవారం ఉదయం బయటకు వెళ్లిన తన తండ్రి తలపై గాయాలతో చనిపోయారని సల్మాన్‌ అన్సారీ అనే వ్యక్తి తెలిపారు.

ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్‌ గాయాలు  
ఈశాన్య ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అనిల్‌ బైజాల్‌ సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫ్రాబాద్, గోకుల్‌పురిల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. దాదాపు 630 మందిని అరెస్ట్‌ చేయడమో లేక అదుపులోకి తీసుకోవడమో చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు 7 వేల మంది పారా మిలటరీ దళాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య శుక్రవారానికి 42కి చేరింది.  వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్‌ గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం నలుగురు చనిపోయారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 25 వేల చొప్పున అందజేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు.

ఐపీఎస్‌ శ్రీవాస్తవకు అదనపు బాధ్యతలు 
అల్లర్ల సమయంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్‌ కమిషనర్‌గా నియమితుడైన ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవకు శుక్రవారం అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నుంచి ఆయన ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా విధులు చేపట్టనున్నారు. అల్లర్లను గుర్తించడంలో, అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొన్న ప్రస్తుత కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ‘ప్రజల్లో భద్రతా భావాన్ని, మా కోసం పోలీసులున్నారనే ధైర్యాన్ని పాదుకొల్పడమే ప్రస్తుతం నా ప్రధాన బాధ్యత’ అని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రీవాస్తవ  వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో 331 శాంతి సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు.

కాంగ్రెస్‌ కమిటీ 
అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఐదుగురితో కూడిన కమిటీని శుక్రవారం కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ఏర్పాటు చేశారు.

బిల్డింగ్‌ పైనుంచి దూకేశాం 
‘బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా, అకస్మాత్తుగా ఒక గుంపు మా ఇంట్లోకి జొరబడింది. నన్ను, నా ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించడం ప్రారంభించారు. భయంతో దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్‌ పై నుంచి దూకేశాం’ అని ఒక బాధిత మహిళ  తెలిపింది. ఆమె ఒక ఎన్జీవోను నిర్వహిస్తున్నారు.

‘గాంధీ’లపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి!

అల్లర్ల తర్వాత తండ్రి ఆచూకీ తెలీకపోవడంతో తల్లితో కలసి ఢిల్లీలో ఓ ఆస్పత్రి మార్చురీ బయట వేచి ఉన్న బాలిక

విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక వాద్రాలపై కేసులను నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆప్‌ నేతలు మనీశ్‌ సిసోడియా, అమానతుల్లా ఖాన్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్‌ పఠాన్‌లపై కూడా ఎఫ్‌ఐఆర్‌ దాఖలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ‘లాయర్స్‌ వాయిస్‌’ సంస్థ తమ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారించింది. విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్లలో తాము భాగస్వాములమవుతామని భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితరులు దాఖలు చేసిన  పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది. సీబీఎస్సీ పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది.

ప్రతిపక్షాల వల్లే అల్లర్లు: అమిత్‌ షా

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారమే ఢిల్లీలో మత ఘర్షణలకు దారితీసిందని హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. భువనేశ్వర్‌లో జరిగిన ర్యాలీలో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ.. ‘సీఏఏ అమలుతో ముస్లింలు దేశ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం సాగించాయి. ప్రజలను రెచ్చగొట్టడం గొడవలకు దారితీసింది’ అని అన్నారు. సీఏఏతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు. పైపెచ్చు దీనితో మరికొందరికి పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం చారిత్రక నిర్ణయం. అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, మమతా దీదీ అబద్ధాలు ప్రచారం చేశారు’ అని ఆరోపించారు.

రెచ్చగొట్టిన వారిపై చర్యలు తీసుకోండి: విపక్షాల లేఖ
ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతవాతావరణం నెలకొనేలా యంత్రాంగాన్ని ఆదేశించాలని, విద్వేషాలను ప్రేరేపించేలా ప్రసంగించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసేతర ప్రతిపక్షాల నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన వారి కోసం సహాయ శిబిరాలను ప్రారంభించాలని, రక్షణ కల్పించడంతోపాటు నిత్యావసర సరుకులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.  ఢిల్లీలో పరిస్థితులపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలని వారు రాష్ట్రపతిని కోరారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌కు చెందిన శరద్‌ యాదవ్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్, ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి టీఆర్‌ బాలు, సీపీఐ నేత డి.రాజా, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మనోజ్‌ ఝా, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఆ లేఖపై సంతకాలు చేశారు.

ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించా: మమతా

ఈస్టర్న్‌ జోనల్‌ కౌన్సిల్‌(ఈజెడ్‌సీ) సమావేశంలో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ప్రస్తావించినట్లు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన ఈజెడ్‌సీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ సమావేశంలో సీఏఏ, ఎన్నార్సీల ప్రస్తావన రాలేదు. అవి సమావేశం ఎజెండాలో లేవు. ఢిల్లీలో ఘర్షణలను మాత్రం నేను ప్రస్తావించా. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు మరింత విషమించకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులకు పరిహారం అందించాలని కోరా’ అని తెలిపారు.

పేరు అడిగి.. కొట్టి చంపారు!

ఉదయం చెత్త ఏరేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో తిరిగివచ్చి, అనంతరం చనిపోయిన ఘటన శుక్రవారం ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకుంది. అయూబ్‌ షబ్బీర్‌ ఢిల్లీ శివార్లలోని గజియాబాద్‌లోని నస్బంది కాలనీవాసి. రోజూ చెత్త, ఇతర వ్యర్థ వస్తువులు ఏరుకుని, వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. ఆయన శుక్రవారం ఉదయం చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లాడని, సాయంత్రం కొందరు ఆయనను తలపై తీవ్ర గాయాలతో తీసుకువచ్చారని ఆయన కుమారుడు సల్మాన్‌ తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మరణించాడన్నారు. ‘వెళ్లొద్దని చెప్పాను. అయినా వినలేదు. పరిస్థితులు బాగానే ఉన్నాయి. సంపాదన లేకుండా ఎంతకాలం ఉంటాం? అని చెప్పి ఉదయమే బయటకు వెళ్లాడు’ అని సల్మాన్‌ వివరించాడు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో కొందరు  పేరు, మతం అడిగి, ఆ తరువాత దారుణంగా కొట్టారని తన తండ్రి తనకు చెప్పాడని సల్మాన్‌ వివరించాడు. పోలీసులకు సమాచారమిచ్చానని, అయినా, వారు తన తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సహకరించలేదని చెప్పారు. తాను దివ్యాంగుడినని, తండ్రి తప్ప తనకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top