
నోయిడా : గ్రేటర్ నోయిడాలోని ఓ కాలనీ వాసులంతా తమ వీధి పేరు మార్చాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని ఓ వీధి పేరు ‘‘పాకిస్థాన్ వాలీ గలీ’’ అని ఉండటంతో తామంతా పాకిస్థానీయులనే భావన ఈ ప్రాంతంలో ఏర్పడిందని, తక్షణమే తమ ప్రాంతం పేరు మార్చాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అలాగే ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సైతం ఈ విషయమై అభ్యర్థించారు. మొత్తం కాలనీలో 70 కుటుంబాలు నివసిస్తుండగా, వీరంతా ఏడు దశాబ్దాల క్రితం దేశ విభజన సమయంలో భారత్ వచ్చేసి నోయిడాలో స్థిరపడిపోయారు. అయితే వీరందరినీ నేటికీ పాకిస్థానీయులుగా గుర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ వాలీ గలీ అనే పేరు పడటంతో తమకు విద్య, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తామంతా భారతీయులమేనని కాలనీ వాసులు వాపోతున్నారు.