కశ్మీర్‌కు ‘రోడ్‌మ్యాప్‌’ లేదు!

No Road Map for development in Jammu and Kashmir and Ladakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఓ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. కశ్మీర్‌ రాష్ట్రం అక్టోబర్‌ 31వ తేదీ నుంచి జమ్మూ కశ్మీర్‌ రెండు డివిజన్లు ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా అధికారికంగా ఆవిర్భవించాయి. జమ్మూ కశ్మీర్‌కు శాసన సభ ఉంటుంది. లద్దాఖ్‌ అది ఉండదు. ఈ రెండు ప్రాంతాల అభివద్ధికి ఎలాంటి ‘రోడ్‌మ్యాప్‌’  లేకుండా కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భవించడం ఆశ్చర్యకరమైన విషయం. ‘ కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన జమ్మూ కశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌’ కింద రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడగొట్టారుగానీ రాష్ట్రాభివద్ధికి సంబంధించి ఒక్క ముక్కలేదు. అన్ని పాలనాపరమైన అంశాలే ఉన్నాయి. వాటిలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. 

ఈ చట్టంలో కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించిన 153 చట్టాలను, 11 గవర్నర్ల ఉత్తర్వులను రద్దు చేశారు. 166 రాష్ట్ర చట్టాలను యథావిధిగా తీసుకున్నారు. ఏడు చట్టాలను సవరించి తీసుకున్నారు. వాటికి తోడు 106 కేంద్ర చట్టాలను కూడా యథావిధిగా తీసుకున్నారు. ప్రతి కేంద్ర చట్టంలో ‘జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాన్ని మినహాయించి, దేశం మొత్తానికి వర్తిస్తుంది’ అన్న క్లాజ్‌ ఉంటుంది. ఆ క్లాజ్‌ను ఎత్తివేయడానికి మరో రాజ్యాంగ సవరణ అవసరం. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ అని స్పష్టంగా ఆ చట్టాల్లో పేర్కొనాల్సి ఉంటుంది. అది ఇంతవరకు జరగలేదు. కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో తెలియక జమ్మూ కశ్మీర్‌ యంత్రాంగం ఇప్పటి వరకు చేతులు ముడుచుకుని కూర్చుంది. 

ఇక కశ్మీర్‌ పోలీసు యంత్రాంగం ఇప్పటికీ నేరస్థులపై కేవలం కశ్మీర్‌కే పరిమితమైన ‘రణబీర్‌ పీనల్‌ కోడ్‌’ను ప్రయోగిస్తోంది. ఆ స్థానంలో ఆ స్థానంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ రావాల్సి ఉంది. కశ్మీర్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ నియమకాలను రద్దు చేసి, ఆ క్యాడర్‌ను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలకు తీసుకరావాల్సి ఉంటుంది. భూమి హక్కులను రాష్ట్రానికే ధారాదత్తం చేసిన రాజ్యాంగంలోని 35 ఏ ఆర్టికల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో భూమి హక్కులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకరావాల్సి ఉంది. రాష్ట్రం, కేంద్రం మధ్య ఆస్తుల పంపకానికి బోలడంత కసరత్తు జరగాల్సి ఉంది. కేంద్రం, కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య నీరు, విద్యుత్‌ పంపకాలు జరగాలి. రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను రద్దు చేసి ఆ స్థానంలో ప్రత్యామ్నాయ కమిషన్‌ను తీసుకరావాలి. రాష్ట్ర మానవ హక్కుల సంఘం సహా పలు కశ్మీర్‌ ప్రత్యేక సంఘాలను రద్దు చేయాల్సి ఉంది. వీటన్నింటికి కొత్త చట్టాలు అవసరం. 

మరో కీలకాంశం 
జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ స్థానాలను ముందుగా 107కు పెంచుతామని, ఆ తర్వాత 114 చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందుకు నియోజకవర్గాల పునర్‌ వర్గీకరణ చిక్కులతో కూడిన భారీ కసరత్తు. రద్దయిన కశ్మీర్‌ అసెంబ్లీలో 87 స్థానాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ నియోజక వర్గాల్లో కశ్మీర్‌ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అందుకనే అధిక స్థానాలకుగా విడగొట్టేందుకు పాలక పక్షం కుట్ర పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వర్గీకరణలో ఎస్సీ,ఎస్టీలకు కూడా సీట్లు రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top