రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ అక్కర్లేదు

No proposal for mandatory Aadhaar linkage for property deals: Govt - Sakshi

ఆస్తులకు తప్పనిసరి చేయాలని అనుకోవడం లేదు

ఏకాభిప్రాయం తర్వాతే జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులు

పార్లమెంటులో కేంద్రం

న్యూఢిల్లీ: ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ను తప్పనిసరి చేసే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) హర్‌దీప్‌ సింగ్‌ పురీ పార్లమెంటుకు మంగళవారం తెలిపారు. అయితే వినియోగదారులు అనుమతిస్తేనే ఆధార్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్లను ధ్రువీకరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు.

ఆధార్‌ను ఆస్తుల లావాదేవీలకు కూడా తప్పనిసరి చేస్తే బాగుంటుందని పురీ గత నెలలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా ఆయన పార్లమెంటులో చెప్పిన మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా, బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఆధార్‌ను ఉపయోగిస్తామని సూచనప్రాయంగా అన్నారు. మరోవైపు 245 పురాతన చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. ఈ 245 చట్టాల్లో 1859 నాటి కలకత్తా పైలట్స్‌ చట్టం, 1911 నాటి దేశద్రోహ సమావేశాల నిరోధక చట్టం కూడా ఉన్నాయి.  

ఏకాభిప్రాయంతోనే జీఎస్టీలోకి పెట్రోల్‌
పెట్రో ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందనీ, అయితే అన్ని రాష్ట్రాలను సంప్రదించి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ సమాచారం చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా భారత్‌లో పెట్రోల్, డీజిల్‌ ధరలు ఎందుకు తగ్గడంలేదో కూడా వివరించాలని చిదంబరం కోరగా, రాష్ట్రాలు వేస్తున్నపన్నులే అందుకు కారణమని జైట్లీ అన్నారు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌లో అనుబంధ బ్యాంకులు విలీనమైనప్పటికీ... ఆ సంస్థలో స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాన్ని ప్రకటించే ఆలోచన లేదని జైట్లీ చెప్పారు.

సమాచార రక్షణకు కొత్త చట్టం తేవాలి
దేశ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ రాజ్యసభను కోరారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ దాదాపు 13 కోట్ల మంది భారతీయుల ఆధార్‌ వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారానే లీక్‌ అయ్యాయనీ, ఆధార్‌ డేటాబేస్‌ను అమెరికా నిఘా సంస్థ సీఐఏ పరిశీలించినట్లు వికిలీక్స్‌ కూడా చెప్పిందని రాయ్‌ అన్నారు. కాబట్టి ముందు సమాచార రక్షణకు కొత్త చట్టం తెచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. అలాగే ప్రభుత్వేతర సంస్థలైన టెలికాం ఆపరేటర్లు, ప్రైవేటు బ్యాంకులు తదితరాలకు ప్రజల ఆధార్‌ సమాచారం ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top