ఇక బీజేపీకి మనుగడ లేదు | Nitish supports Advani on Emergency fears | Sakshi
Sakshi News home page

ఇక బీజేపీకి మనుగడ లేదు

Jun 18 2015 2:28 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఇక బీజేపీకి మనుగడ లేదు - Sakshi

ఇక బీజేపీకి మనుగడ లేదు

బీహార్లో బీజేపీకి ఇక మనుగడ లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. పట్నాలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ , ఫుడ్ ప్రాసెసింగ్ సభలో పాల్గొన్న ఆయన మీడితో మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని వెనకేసు కొచ్చారు.

పట్నా: బీహార్లో బీజేపీకి ఇక మనుగడ లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. పట్నాలో ఏర్పాటుచేసిన అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని వెనకేసుకొచ్చారు. దేశంలో మరోసారి ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చే అవకాశముందంటున్న అద్వానీ ఆందోళనను సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే  శక్తులు చాలా బలంగా ఉన్నాయన్న ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు.

లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను మోదీ విస్మరించారని మండిపడ్డారు. ఏడాది పాలన అంటూ ఇప్పటివరకు గప్పాలు కొట్టుకున్నారని, కానీ ఏడాది పాలనలోని  కుంభకోణాలు ఒక్కొక్కటిగా ఇపుడు బయటపడుతున్నాయన్నారు.  లలిత్ మోదీ, సుష్మా స్వరాజ్ వివాదానికి మానవీయ కోణం అనే ముసుగు వేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేంద్రం పక్షపాత ధోరణిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, తాజా పరిణామాలతో ప్రభుత్వంమీద వారు నమ్మకం కోల్పోయారని అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని  విమర్శించారు. యోగాను ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆచరించాలి తప్ప,  యోగా డే అంటూ డాంబికంగా ప్రదర్శనలు ఇస్తే వచ్చేది కాదని నితీష్ వ్యాఖ్యానించారు.

కాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్వానీ  తాజా రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  దేశంలో ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి మళ్లీ రాదని తాను గట్టిగా చెప్పలేనని అద్వానీ అన్నారు. రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉందని, ఆ నాయకత్వంపై తనకు నమ్మకం లేదంటూ నరేంద్ర మోదీపై అద్వానీ పరోక్షంగా చురకలంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement