సోనియా అంత మనసు లేదు

Nirbhaya father lashes out at Indira Jaising for asking her to forgive convicts - Sakshi

ఏడేళ్లుగా పోరాడుతున్నాం.. మేం రాజకీయ నాయకులం కాదు

‘నిర్భయ’ దోషులను క్షమించాలన్న లాయర్‌ వ్యాఖ్యలపై నిర్భయ తండ్రి స్పందన

అలాంటి సలహా ఇచ్చినందుకు నిర్భయ తల్లికి సారీ చెప్పాలని డిమాండ్‌

న్యూఢిల్లీ: ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్‌ ఇందిరా జైసింగ్‌ చేసిన సూచనపై ‘నిర్భయ’ తండ్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి సలహా ఇచ్చినందుకు జైసింగ్‌ సిగ్గుపడాలన్నారు.. తమకు సోనియా గాంధీ అంత పెద్ద మనసు లేదని వ్యాఖ్యానించారు. మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే జైసింగ్‌ శుక్రవారం ఒక ట్వీట్‌ చేస్తూ... కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను క్షమించినట్టుగానే ఈ కేసు దోషులను నిర్భయ తల్లిదండ్రులు క్షమించాలని సూచించారు.

ఒక తల్లిగా నిర్భయ తల్లిదండ్రుల బాధను తాను అర్థం చేసుకోగలనని, కాకపోతే మరణశిక్ష మాత్రం సరికాదని ఇందిరా జైసింగ్‌ తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. రాజీవ్‌ హంతకురాలు నళినీ శ్రీహరన్‌కు న్యాయస్థానం మరణ శిక్ష విధించగా.. సోనియాగాంధీ జోక్యం చేసుకుని ఆమెను క్షమించినట్లు  ప్రకటించారు. ఆ తరువాత ఆమెకు పడ్డ మరణశిక్ష కాస్తా యావజ్జీవ కారాగార శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటిపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. ఇందిరా జైసింగ్‌ సూచనను తోసిపుచ్చారు. మహిళగా ఉంటూ అలాంటి సలహా ఇచ్చినందుకు ఆమె నిర్భయ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘ఏడేళ్లుగా మేము ఈ కేసుపై పోరాడుతున్నాం. మేము రాజకీయ నాయకులము కాము. సామాన్యులము. మా హృదయాలు సోనియా గాంధీ అంత విశాలం కాదు’’ అని స్పష్టం చేశారు. ఇందిరా జైసింగ్‌ చేస్తున్న వ్యాఖ్యల వంటివే దేశంలో అత్యాచారాలు పెరిగిపోయేందుకు కారణమని అన్నారు. నిర్భయ తల్లి కూడా తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. సామూహిక అత్యాచారం వంటి క్రిమినల్‌ కేసుల్లో పడే శిక్షపై దోషులను క్షమించమని బాధితుల కుటుంబ సభ్యులు చెప్పడంతో ఏమీ మారిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

‘‘న్యాయ వ్యవస్థ పరంగా చూస్తూ బాధితురాలి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనే విషయానికి విలువ లేదు. న్యాయస్థానాలు చట్టం ప్రకారమే నడుచుకుంటాయి. పైగా సోనియాగాంధీ మాదిరిగా నిర్భయ దోషులను క్షమించాలన్న ఇందిరా జైసింగ్‌ సలహాను నిర్భయ తల్లిదండ్రులు తోసిపుచ్చుతున్నారు’’ అని సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ తెలిపారు. అయితే రాష్ట్రపతికి పెట్టుకునే క్షమాభిక్ష పిటిషన్లలో ఇలాంటి (బాధితురాలి కుటుంబం క్షమించింది) విషయాలను ప్రస్తావించవచ్చునని మరో న్యాయవాది వికాస్‌ సింగ్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top