
యూపీఏ బాటలోనే ఎన్‌డీఏ
ప్రధాని నరేంద్ర మోడీ కూడా గత యూపీఏ ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నాడని సీపీఎం ఎంపీ తపన్‌సేన్ ఆరోపించారు.
సీపీఎం నేత, ఎంపీ తపన్ సేన్
బళ్లారి టౌన్ : ప్రధాని నరేంద్ర మోడీ కూడా గత యూపీఏ ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నాడని సీపీఎం ఎంపీ తపన్‌సేన్ ఆరోపించారు. ఆదివారం నగరంలోని గురు ఫంక్షన్ హాల్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో యూపీఏ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించి బీజేపీని గెలిపిస్తే ఆ పార్టీ కూడా అదే సిద్ధాంతాలను అనుసరిస్తోందన్నారు. ఈసారి బడ్జెట్ చూస్తుంటే సామాన్య ప్రజలకు అనుకూలంగా లేదన్నారు.
ఎన్నికల్లో సామాన్య వర్గాలకు, కార్మికులకు మంచి రోజులు తీసుకొస్తామని హామీ ఇచ్చిన మోడీ పెట్టుబడిదారులు, విదేశీ సంపన్మూలాలకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రత్యేకించి ఏ విధమైన బడ్జెట్ ప్రవేశ పెట్టలేదన్నారు. బెంగాల్‌లో తృణమాల్ కాంగ్రెస్ ప్రభుత్వం 450 మంది సీఐటీయూకి కార్యకర్తలపై పోలీసులతో అరాచకాలు సృష్టిస్తోందన్నారు. కార్మిక సంఘాలు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల పోరాటాల రూపురేఖలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీఐటీయూ నేత ప్రసన్న కుమార్, ఆర్‌ఎస్.బసవరాజ్, టీజీ. విఠల్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.