
ముంబై: ఫార్మా సంస్థలు, బయో టెక్నాలజీ సంస్థలకు ఔషధాల ఆవిష్కరణ, కాంట్రాక్ట్ రీసెర్చ్, అభివృద్ధి, తయారీ సేవలు(సీఆర్‌డీఎంఓ) అందించే ఆంథెమ్ బయోసైన్సెస్ తమ పబ్లిక్ ఇష్యూకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,016 కోట్లు సమీకరించింది. ఈ సంస్థ ఐపీఓ సోమవారం(జూన్ 14న) ప్రారంభమై, బుధవారం ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.540–570గా ఉంటుంది. ఇందులో భాగంగా గరిష్ట ధర రూ.570కి 60 ఫండ్లకు (యాంకర్ ఇన్వెస్టర్లు) 1.78 కోట్ల ఈక్విటీ కేటాయించినట్లు కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది.
ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉండటంతో కంపెనీకి ఎటువంటి నిధులు అందవు. మొత్తం 60 యాంకర్ ఇన్వెస్టర్లలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, ఈస్ట్ స్ప్రింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్, క్వాంట్ ఎంఎఫ్, మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్ తదితర ఫండ్ సంస్థలున్నాయి. ఇప్పటికే ఈ సీఆర్‌డీఎంఓ విభాగం నుంచి సాయి లైఫ్ సైన్సెస్, సింజీన్ ఇంటర్నేషనల్, సువెన్ లైఫ్ సైన్సెస్, దివీస్ ల్యాబోరేటన్స్ కంపెనీలు ఐపీఓ పూర్తి చేసుకొని ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. జేఎం ఫైనాన్సియల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ కంపెనీలు ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.