
పారిశ్రామికులారా.. రారండి
పెట్టుబడులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమంటూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
►భారత్‌లో పెట్టుబడులకిదే అదను
►ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ భరోసా
►‘మేక్ ఇన్ ఇండియా’ వీక్ ప్రారంభం
ముంబై: పెట్టుబడులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమంటూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారదర్శకమైన, స్థిరమైన పన్ను విధానాలను అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. లెసైన్సుల విధానాలను సరళతరం చేయడం, కంపెనీ చట్టం ట్రిబ్యునల్ .. మేధోహక్కుల పరిరక్షణకు మరింత సమర్థ యంత్రాంగం వంటి ఎన్నో సంస్కరణలను అమలు చేయనున్నట్లు వివరించారు. భారత తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను తెలియజేసే లక్ష్యంతో తలపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వీక్‌ను శనివారం ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వెల్లడించారు. స్వీడన్ ప్రధాని క్యెల్ స్టెఫాన్ లోఫెన్, ఫిన్లండ్ ప్రధాని జుహా పెట్రి సిపిలా తదితర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
మేక్ ఇన్ ఇండియా.. భారీ బ్రాండ్...
గతంలో ఎన్నడూ ఎరుగనంత భారీ బ్రాండ్‌గా మేక్ ఇన్ ఇండియాను మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ తయారీ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు. ‘ఇది ఆసియా శతాబ్దం. దీన్ని మీ శతాబ్దంగా చేసుకోవాలనుకుంటే భారత్ కేంద్ర బిందువుగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగం కావాలన్నది నా సలహా. భారత్‌లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని, వృద్ధిలో పాలు పంచుకోవాలని ఇక్కడున్న వారితో పాటు ఇక్కడికి రానివారిని కూడా ఆహ్వానిస్తున్నాను’ అని మోదీ చెప్పారు. పన్నులపరంగా ఇప్పటికే పలు సవరణలు చేశామని, మార్పుల్లేని పారదర్శక, స్థిరమైన పన్నుల విధానాలను అమల్లోకి తెస్తామన్నారు. ‘ఇంకా వేచి చూస్తూ కూర్చోవద్దు. విశ్రమించొద్దు. భారత్‌లోఅపార అవకాశాలుఅందిపుచ్చుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపునిచ్చారు.
తయారీకి తోడ్పాటు
తయారీ రంగానికి తోడ్పాటునిచ్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. భారత వృద్ధి రేటు 7 శాతానికి పైగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడుతుందని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలే అంచనా వేస్తున్నాయన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 48 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. తయారీ రంగంలో అవకాశాలను వివరిస్తూ... 50 నగరాల్లో మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
భారీ పెట్టుబడులతో రోడ్లు, పోర్టుల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. మేకిన్ ఇండియా వీక్ ప్రారంభం సందర్భంగా పలు స్టాల్స్‌ను మోదీ ఈ సందర్భంగా సందర్శించారు. తర్వాత రతన్ టాటా, ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటి పారిశ్రామిక దిగ్గజాలతో విందులో పాల్గొన్నారు. టైమ్ ఇండియా తొలి విడత పురస్కారాలను టాటా స్టీల్ తదితర సంస్థలకు అందజేశారు.
మేక్ ఇన్ ఇండియా వీక్ విశేషాలివీ..
ఫిబ్రవరి 18 దాకా జరిగే మేక్ ఇన్ ఇండియా వీక్‌లో సుమారు 2,500 పైచిలుకు విదేశీ, 8,000 పైచిలుకు దేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి. 68 దేశాల నుంచి ప్రభుత్వాధికారుల బృందాలు, 72 పైగా దేశాల నుంచి వ్యాపార బృందాలు హాజరవుతున్నాయి. వేదికలో పలు రంగాలకు సంబంధించి దేశ విదేశీ సంస్థల పెవిలియన్లు ఉం టాయి. పలు రంగాలు, విధానాలు, మేధో హక్కులు తదితరాలపై సెమినార్లు ఉం టాయి. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడి ప్రతిపాదనలు రాగలవని ఆతిథ్య రాష్ట్రం మహారాష్ట్ర అంచనా వేస్తోంది.
రూ.21,400 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు
మేక్ ఇన్ ఇండియా వీక్ తొలి రోజున శనివారం సుమారు రూ.21,400 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఎల్‌సీడీ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం స్టెరిలైట్ గ్రూప్ సంస్థ ట్విన్‌స్టార్ డిస్‌ప్లే టెక్నాలజీస్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ)తో దాదాపు రూ.20,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. విదర్భ ప్రాంతంలో జ్యూస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్తాన్ కోకకోలా బెవరేజెస్, జైన్ ఇరిగేషన్, మహారాష్ట్ర వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
రూ.1,400 కోట్ల పెట్టుబడులతో గార్మెంట్స్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ఎంఐడీసీతో రేమండ్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే పదేళ్లలో భారత్‌లో 100 కోట్ల డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టనున్నామని చైనా కంపెనీ శానీ గ్రూప్ ప్రెసిడెంట్ టాంగ్ షివ్‌గో తెలిపారు. భారత్‌లో పెట్టుబడులను పెంచుకోవడంపై తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లాఫ్వెన్ చెప్పారు. పెట్టుబడులకు విఘాతం కలిగించే అంశాల పరిష్కారంపై ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఫిన్లాండ్ ప్రధాని సిపిలా చర్చించారు.