ప్రాంతీయంగా శాంతి నెలకొనాలి 

Narendra Modi phone call to various country leaders - Sakshi

వివిధ దేశాధినేతలకు ప్రధాని ఫోన్‌

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ బుధవారం ఇరుగు పొరుగు దేశాధినేతలతో ఫోన్లలో మాట్లాడారు. వారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందిస్తూనే ప్రాంతీయంగా శాంతి భద్రతల కోసం భారత్‌ కట్టుబడి ఉందని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, నేపాల్‌ ప్రధాని కె.పి. శర్మ ఒలి, భూటాన్‌ రాజు జిగ్మె ఖేసర్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సొలి తదితరులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతి భద్రతల అంశానికే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. 

భారత వాయుసేన వీడియో వైరల్‌ 
భారత వాయుసేన 2020 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు అందిస్తూ రూపొందించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నరనరాల్లోనూ ఉప్పొంగే దేశభక్తి, ఉవ్వెత్తున ఎగిసిపడే భావోద్వేగాలతో ఈ వీడియోను రూపొందించారు. గగన తలాన్ని రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడే వాయుసేన బలగాల కర్తవ్యదీక్షలో ఎలాంటి సాహ సాలు చేస్తారో చూపించిన అత్యంత శక్తిమంతమైన దృశ్యాలు అందరినీ కట్టిపడేశాయి. హిందీలో కవితాత్మకంగా దేశభక్తిని, మాతృభూమి రక్షణ కోసం వాయుసేన చేసే సాహసాన్ని వర్ణించిన తీరుతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీడియోను ఐఎఎఫ్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. అది క్షణాల్లోనే వైరల్‌ అయింది. కొద్ది గంటల్లో 13వేలకు పైగా వ్యూస్, 5వేలకు పైగా లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్‌లతో వైరల్‌గా మారింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top