బీజేపీ ఆఫీసుల్లో టాయ్‌లెట్స్ చూడండి! | Narendra modi calls for clean toilets, but those at BJP office are dirty | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆఫీసుల్లో టాయ్‌లెట్స్ చూడండి!

Dec 31 2015 7:03 PM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మానస పుత్రికైన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఎంత ఊదరగొడుగుతున్నా ఆయన పార్టీ బీజేపీకి చెందిన నేతలకు మాత్రం అది చెవికెక్కుతున్నట్టు లేదు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మానస పుత్రికైన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఎంత ఊదరగొడుగుతున్నా ఆయన పార్టీ బీజేపీకి చెందిన నేతలకు మాత్రం అది చెవికెక్కుతున్నట్టు లేదు. సాక్షాత్తు ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్ లోని బీజేపీ కార్యాలయంలోనే సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఎన్నోసార్లు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని ఆ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఉన్న మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల కంపుకొడుతున్నాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలకు సరైన మరుగు దొడ్లు లేవని అంటున్నారు.

 బీజీపీ ఢిల్లీ శాఖకు చెందిన కార్యాలయంలో కూడా ఇలాంటి అధ్వాన్న పరిస్థితే కొనసాగుతోంది. బీజేపీ అధికారంలోవున్న మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమ మున్సిపల్ పరిధిలో ఏడాదిలో ఏడెనిమిది లక్షల మరుగు దొడ్లను నిర్మిస్తామని పార్టీ నేతలు గొప్పగా ప్రకటించారు. ఏడాది గడిచినా వందకు మించి మరుగుదొడ్లు నిర్మించిన దాఖలాలు కనిపించడం లేదు. బీజేపీ పార్టీ కార్యాలయం తన నియోజక వర్గం పరిధిలో ఉన్నందున తన నియోజకవర్గం నిధులతో తానే స్వయంగా శుభ్రమైన మరుగు దొడ్లు కట్టిస్తానని, అందుకు అనుమతించాలంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ స్వయంగా లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 గతేడాది ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘స్వచ్ఛ భారత్’ పథకాన్ని ఘనంగా ప్రకటించడం తెల్సిందే. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించారు కూడా. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం సెలబ్రటీలను అంబాసిడర్లుగా నియమించిన విషయమూ తెల్సిందే. పథకాన్ని ప్రకటించిన పార్టీనే పట్టించుకోకపోతే ప్రజలెలా ముందుకు కదులుతారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement