గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌.. గుర్తు పట్టారా..!

Muthulakshmi Reddi Was a First Woman Surgeon In India - Sakshi

చెన్నై: అభాగ్యుల కోసం ఇంటినే ఆశ్రయంగా మార్చిన మనసున్న మారాణి.. లింగ అసమానత్వంపై అలుపెరగని పోరాటం చేసిన ధీర వనిత.. దేవదాసి కుటుంబంలోనే పుట్టి ఆ వ్యవస్థనే నామరూపల్లేకుండా మార్చేందుకు కంకణం కట్టుకున్న పోరాట యోధురాలు.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ముత్తులక్ష్మి రెడ్డి  133వ జయంతి నేడు.. తన సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం జూలై 30ను ‘హస్పిటల్‌ డే’గా సోమవారం ప్రకటించింది. ఆమె అందించిన వైద్య సేవలకు గుర్తుగా ఇక మీదట ప్రతి యేటా ఈ రోజును ‘హస్పిటల్‌ డే’ను ఘనంగా నిర్వహించనున్నారు. భారత మొదటి మహిళా సర్జన్‌ ముత్తులక్ష్మి రెడ్డి జయంతిని పురస్కరించుకుని గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. చేతిలో పుస్తకం పట్టుకున్న మహిళ మిగతావారికి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఈ ఫొటో ప్రతిబింబిస్తుంది. నిజ జీవితంలోనూ ఆమె జీవన విధానం ఆదర్శదాయకమే!

మొట్ట మొదటి మహిళా సర్జన్‌..
పుదుకొట్టాయ్‌ గ్రామంలో 1886వ సంవత్సరంలో దేవదాసీ కుటుంబంలో ముత్తులక్ష్మి జన్మించారు. దేవదాసీ వ్యవస్థలో ఉండే కష్టాలను కళ్లారా చూశారు. ఆడవారికి చదువు దండగ అనుకునే కాలంలో ఉన్నత విద్య వైపు అడుగులు వేశారు. ఆ క్రమంలోనే మహరాజ్‌ కళాశాలలో అడ్మిషన్‌ సంపాదించి బాలుర ఇన్‌స్టిట్యూట్‌లో అడుగు పెట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత మద్రాస్‌ మెడికల్‌ కళాశాలలో అడ్మిషన్‌ పొందిన మొదటి మహిళగా ఖ్యాతి గడించారు. సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైద్య విద్యను పూర్తి చేసి భారత మొట్టమెదటి మహిళా సర్జన్‌గా పేరు సంపాదించుకున్నారు.

ఇంటినే ఆశ్రయంగా..
ముత్తులక్ష్మి డాక్టర్‌ మాత్రమే కాదు, విద్యావేత్త, చట్టసభ సభ్యురాలు, సామాజిక సంస్కర్త కూడా! 1954లో రోగుల కోసం ‘అడయార్‌ క్యాన్సర్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేశారు. దీనిలోని రోగులకు మానసిక సంతోషాన్ని అందించటానికి వైద్య నిపుణులతో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. కాగా ఆమె భారత మొదటి మహిళా శాసనసభ్యురాలు కూడా! తర్వాతి కాలంలో మద్రాస్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌కు డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఎన్నో సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ ఫంక్షన్‌లలో దేవదాసి ప్రదర్శనలను నిర్వహించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవదాసి వ్యవస్థ రద్దుకు, కనీస వివాహ వయసు పెంపు, లింగ అసమానతలు తదితర విషయాలపై పోరాడారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితుల కోసం ఆశ్రమాన్ని నెలకొల్పారు. అందుకోసం అడయార్‌లోని తన ఇంటినే ఆశ్రయంగా మార్చారు. దండి సత్యాగ్రహం కోసం 1930లో శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆమె అందించిన విశిష్ట సేవలకుగానూ భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 1968 జూలై 22న ముత్తులక్ష్మి కన్నుమూశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top