ఆమె అలా చెప్పకూడదని తెలియక...

Mumbai Woman Shares OTP 28 Times, Loses Rs 7 Lakh - Sakshi

ముంబై : ఇటీవల ఆన్‌లైన్‌ మోసాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో వింటూనే ఉన్నాం. బ్యాంకు అధికారులమంటూ కాల్‌ చేస్తున్న వారికి, అకౌంట్‌ వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ వంటి కోడ్‌లు చెప్పకూడదని పలుమార్లు సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ముంబైలో ఓ మహిళ తన అమాయకత్వంతో సైబర్‌ నేరగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పి ఏకంగా ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అన్నిసార్లు ఓటీపీ ఎలా చెప్పావన్న అని పోలీసులు ప్రశ్నించగా.. అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదంటూ బిక్కమొహం వేసేసింది. తనకసలు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ గురించి అసలేం తెలియదని చెప్పింది.

నావీముంబైలోని నెరూల్‌కు చెందిన తస్నీమ్ ముజకర్ మోడక్ అనే మహిళ తనకున్న జాతీయ బ్యాంకులో ఇటీవలే 7.20 లక్షల రూపాయలు క్రెడిట్‌చేసింది. మే 17న తస్నీమ్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తను ఎస్‌బీఐ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్ని సాంకేతిక సమస్యలతో మీ డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయిందని చెప్పాడు. అది తిరిగి పనిచేయాలంటే ఏటీఎం కార్డు వివరాలు, మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాలన్నాడు. అతడు చెప్పినట్టే చేసిన తస్నీమ్‌ అమాయకత్వంతో అతడు ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ చెప్పేసింది. వారం వ్యవధిలో అలా 28 సార్లు ఆ ఆన్‌లైన్‌ మోసగాడికి తన ఓటీపీ చెప్పింది. ఇలా ఓటీపీ చెప్పించుకున్న మోసగాడు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.6.98, 973 కాజేశాడు. పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన తస్నీమ్‌కు తన అకౌంట్‌ నుంచి  రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసింది. దీంతో వెంటనే నెరూల్‌ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆన్‌లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ నేరగాడు మొత్తం మూడు సిమ్‌ కార్డులతో తస్నీమ్‌కు ఫోన్‌ చేసి, ఓటీపీ వివరాలు రాబట్టినట్టు తెలిపారు. ముంబై, నోయిడా, గుర్గావ్‌, కోల్‌కతా, బెంగళూరుల నుంచి ఈ లావాదేవీలు సాగించినట్టు పేర్కొన్నారు. 16 అంకెల డెబిట్‌ కార్డు నెంబర్‌, కార్డుపై ప్రింట్‌ అయిన పేరు, 3 అంకెల సీవీవీ నెంబర్‌ అన్నీ చాలా రహస్యంగా ఉంచుకోవాలని ఆమెకు పోలీసులు చెప్పారు. తన భర్త కువైట్‌లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top