24 గంటల్లో 980 విమానాలు

Mumbai airport sets record with 980 flights in 24 hours - Sakshi

ముంబై విమానాశ్రయం అరుదైన రికార్డు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్‌ రన్‌వే విమానాశ్రయంగా రెండో ఏడాది కూడా రికార్డుల్లోకెక్కింది. జనవరి 20న ఈ విమానాశ్రయం ఈ ఘనత సాధించినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 6న 24 గంటల్లో 974 విమానాల రాకపోకలతో తన పేరిట ఉన్న రికార్డును ముంబై ఎయిర్‌పోర్ట్‌ బద్దలు కొట్టిందన్నారు.

గత మార్చిలో ఒక్క రోజు వ్యవధిలో 837 విమానాల రాకపోకలతో ముంబై విమానాశ్రయం లండన్‌లోని గట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌ (757 విమానాల రాకపోకలు)ను వెనక్కు నెట్టిందని వెల్లడించారు. ముంబై విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేస్తే, ప్రభుత్వ నిషేధం కారణంగా గట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకే పనిచేస్తుందన్నారు. అయినప్పటికీ ఈ విమానాశ్రయానికి 2018లో రోజుకు 870 ఫ్లైట్ల రాకపోకల సామర్థ్యం ఉందన్నారు. రద్దీ సమయాల్లో ముంబై విమానాశ్రయంలో గంటకు 52 విమానాల రాకపోకలు జరిగితే, గట్విక్‌లో ఇది 55గా ఉంటుందన్నారు. విమానాలు నిలిపేందుకు ఎక్కువ చోటు లేకపోవడం, మౌలికవసతుల కొరత ముంబై ఎయిర్‌పోర్టుకు సమస్యగా మారిందన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top