దేశమంతా రుతుపవనాలు

Monsoon covered the whole country  - Sakshi

ఉత్తరాదిన భారీవర్షాలు

జమ్మూకశ్మీర్‌లో నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర  

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పశ్చిమ రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌ను రుతుపవనాలు తాకాయనీ, దేశంలో రుతుపవనాలు చేరుకునే చివరి చోటు ఇదేనని తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు శ్రీగంగానగర్‌ను జూలై 15 నాటికి తాకుతాయనీ, ఈసారి 17 రోజుల ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకున్నాయని ఐఎండీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయన్నారు.

ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే, మే 29నే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉండిన రుతుపవనాలు మళ్లీ గతవారంలో పుంజుకున్నాయి. గతవారం ముందు వరకు దేశవ్యాప్తంగా సగటున 10 శాతం లోటు వర్షపాతం ఉండగా, శుక్రవారానికి అది ఆరు శాతానికి తగ్గింది. దేశంలో వ్యవసాయానికి అవసరమైన వర్షాల్లో 70 శాతం నైరుతి రుతుపవనాల కాలంలోనే కురుస్తాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోయర్‌ సియాంగ్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు ఇండో టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల ప్రభావంతో కొండపై వదులైన భారీ బండరాయి ఒకటి బసర్‌–అకజన్‌ రోడ్డుపై వెళుతున్న ఐటీబీపీ సిబ్బంది మినీబస్సుపై పడటంతో ఈ దుర్ఘటన సంభవించింది.  జమ్మూ–శ్రీనగర్‌ జాతీయరహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మూసుకుపోయింది. దీంతో అమర్‌నాథ్‌ యాత్రకు వెళుతున్న పలువురు భక్తులు బేస్‌క్యాంప్‌లకు తిరిగివెళ్లాల్సి వచ్చింది. అస్సాంలో వరదలకు గురువారం ఒకరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 32కు చేరుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top