చట్టబద్దంగా డబ్బు అందుకుంటున్నా: అమితాబ్ | Sakshi
Sakshi News home page

చట్టబద్దంగా డబ్బు అందుకుంటున్నా: అమితాబ్

Published Tue, Apr 5 2016 6:47 PM

చట్టబద్దంగా డబ్బు అందుకుంటున్నా: అమితాబ్

ముంబై: తాను ఎటువంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. పనామాలో తాను పెట్టుబడులు పెట్టినట్టు పేర్కొన్న కంపెనీల గురించి తనకేమీ తెలియదని చెప్పారు. ఇటువంటి కంపెనీలకు తాను డైరెక్టర్ గా లేనని స్పష్టం చేశారు. తాను చట్టబద్దంగా పన్నులు చెల్లిస్తున్నానని అన్నారు.

విదేశాల నుంచి నిబంధనలకు అనుగుణంగా డబ్బు అందుకుంటున్నానని, సుంకాలు చెల్లిస్తున్నానని చెప్పారు. తన పేరును దుర్వినియోగం చేయడానికి ఇదంతా చేస్తున్నారని బిగ్ బి ఆవేదన వ్యక్తం చేశారు. పనామా పత్రాల్లో తన గురించి పేర్కొన్నదంతా అసత్యం, అభూత కల్పన అని అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ సోమవారం ప్రకటించారు.

డబ్బులు అక్రమంగా దాచడానికి మొస్సాక్ ఫోన్సెకా అనే సంస్థ ద్వారా విదేశీ ప్రముఖులు పనామాలో 2,14,000 కంపెనీలు ఏర్పాటు చేసిటనట్టు కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెల్లడించింది. ఈ జాబితాలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్‌ఎఫ్ కేపీ సింగ్, నాయకులు, కార్పొరేట్లు సహా 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్టు తెలిపింది.
 

Advertisement
Advertisement