రూ.98వేల కోట్ల మోదీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌కు చిక్కులు

Modi Rs 98000 Crore Bullet Train Project Hits A Land Roadblock - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్‌... ముంబై-అహ్మదాబాద్‌ మధ్యలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్ట్‌ తొలి రన్‌ 2022 ఆగస్టు నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూములను సేకరించడం కూడా మొదలుపెట్టింది. కానీ అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది. భూమి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. మహారాష్ట్రలోని పాల్గడ్‌ జిల్లాలో గిరిజన గ్రామాలు, స్థానిక కమ్యూనిటీలు తామెంతో ప్రాణప్రదంగా చూసుకునే భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. పాల్గడ్‌ జిల్లాలో మొత్తం 70కి పైగా గిరిజన గ్రాములున్నాయి. ఆ గ్రామాల్లో 20కి పైగా గ్రామాలు ఈ ప్రాజెక్ట్‌కు భూమి ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపాదిత రైల్‌ కారిడర్‌కు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు కూడా చేపట్టారు ఆ గ్రామ ప్రజలు. 

భారత తొలి హై-స్పీడ్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. 508 కిలోమీటర్లు ఈ ట్రైన్‌ కారిడర్‌ను నిర్మిస్తున్నారు. అసలు 2018 జూన్‌ నాటికే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ భూమి కొనుగోలులో వచ్చిన చిక్కుతో దీని నిర్మాణాన్ని 2019  జనవరికు జరిపారు. ఈ ఏడాది చివరి వరకు ఎలాగైన ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమిని సేకరించి, వచ్చే ఏడాది ప్రారంభించాలని చూస్తున్నారు. కానీ ఈ ఏడాది చివరి వరకైనా భూమిని సేకరిస్తారో లేదో స్పష్టత కావడం లేదు. పాల్గడ్‌ జిల్లా నుంచి వెళ్లే 110 కిలోమీటర్ల కారిడర్‌ మహారాష్ట్ర, గుజరాత్‌ రాజధానులను కలుపుతోంది. 

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయని కానీ అనుకున్న సమయానికి దీని నిర్మాణం చేపడతామని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం సేకరించే భూమికి సర్కిల్‌రేటు కంటే ఐదు రెట్లు ఎక్కువగా చెల్లిస్తామని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 1400 ఎకరాలను,  గుజరాత్‌లో రూ.10 కోట్ల భూమిని సేకరిస్తున్నట్టు దేశీయ రైల్వే పేర్కొంది. దీనిలో భాగంగా పాల్గడ్‌ జిల్లాలోనే 200 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో ఎక్కువ భాగం గిరిజనులవే. మొత్తం 73 గ్రామాల్లో 50 గ్రామాలు అధికారుల ఒప్పందానికి అంగీకరించాయని, కానీ 23 గ్రామాల గిరిజనులు మాత్రం రైల్వే అధికారులకు సహకరించడం లేదని దేశీయ రైల్వే పేర్కొంది. సర్వేకు వెళ్లిన వారిపై దాడులు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే జపనీస్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ ఫండ్స్‌ను అందించింది. ముంబైలో కొన్ని ప్రాంతాల్లో భూమి కొనుగోళ్లు పూర్తయ్యాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top