మీ నాన్న ఓ జవాన్‌.. నువ్వేమో దేశ ద్రోహి..

Mob Slogans Bring Out Your Anti National Son - Sakshi

కోల్‌కతా : ‘దేశద్రోహి చర్యలకు పాల్పడుతున్న నీ కొడుకును బయటకు తీసుకురా..’  అంటూ కొంతమంది యువకులు.. పుల్వామా ఉగ్రదాడికి అనుకూలంగా పోస్టులు పెట్టిన ఓ టీనేజర్‌ ఇంటిపై దాడి చేశారు. ‘మీ నాన్నేమో బీఎస్‌ఎఫ్‌లో జవానుగా పనిచేస్తుంటే.. నువ్వేమో దేశ ద్రోహ చర్యలకు పాల్పడతావా?’ అంటూ చెంప చెళ్లుమనిపించారు. అంతటితో ఆగకుండా భారత జెండాను చేతపట్టించి నడివీధుల్లో ఊరేగించారు. భారత్‌ మతాకీ జై.. పాకిస్తాన్‌ ముర్తాబాద్‌ అని చెప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్నఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం పశ్చిమ బెంగాల్‌లో ఈ తరహా మూక దాడులు పేట్రేగిపోతున్నాయి. ‘ఓ దేశ ద్రోహి ఇంటి ముందు మేమున్నాం’  అనే క్యాప్షన్‌తో సర్బజిత్‌ సాహా అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. వీడియో ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని కుచ్‌బెహార్‌ పట్టణానికి చెందిన అనిక్‌ దాస్‌(22) అనే విద్యార్థి.. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌​చేశాడు. ఈ కామెంట్స్‌ను నిరసిస్తూ కొంత మంది యువకులు అతని ఇంటిని చుట్టుముట్టారు. వీడియో స్పష్టంగా లేనప్పటికి ఆ యువకుని తల్లి కూడా అతని చెంప పగలగొట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు మీ నాన్న బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తుంటే నువ్వేమో దేశ ద్రోహిగా పెరుగుతావా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది భారత ఆర్మీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన దేశద్రోహి.. నీ కొడుకు బయటకు తీసుకురా? అన్న స్లోగన్స్‌ వినబడుతున్నాయి. ‘నేను ఎవ్వరికి మద్దతు తెలపడంలేదు అంతే కానీ దేశద్రోహిని కాదు..’ అని ఆ టీనేజర్‌ వారితో అన్న మాటలు, దీనికి ఎందుకు నీ దేశాన్ని ప్రేమించవని సదరు యువకులు అడిగినట్లు స్పష్టం అవుతోంది. అతన్ని బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి భారత ఆర్మీ జిందాబాద్‌, పాకిస్తాన్‌ ముర్తాబాద్‌ స్లోగన్స్‌ చెప్పించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

మరో ఘటనలో ఓ టీచర్‌కు ఈ మూక సెగ తగిలింది.  నార్త్‌ 24 పరగణాలలోని బోన్‌గాన్‌కు చెందిన స్థానిక టీచర్‌ ఇంటిపై మరో మూక గ్యాంగ్‌ దాడి చేసింది. అతను పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు martyr అనే పదం ఎందుకు వాడుతున్నారని సోషల్‌ మీడియాలో ప్రశ్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ సదరు టీచర్‌ మాత్రం తాను అడిగిన సందర్భం వేరని, అనవసరంగా ఈ వివాదానికి అంటగట్టి ఇబ్బందులకు గుర్తిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను భారతీయుణ్ణేనని, తన దేశభక్తిని శంకించడం ఎందుకని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ దాడులన్నీ బీజేపీ, ఆర్‌ఎస్సెస్‌లు చేస్తున్నవేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top