యువ ఎమ్మెల్యే కాల్చివేత

MLA Satyajit Biswas shot dead in West Bengal - Sakshi

సరస్వతి పూజలో బుల్లెట్ల వర్షం కురిపించిన దుండగులు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ యువ ఎమ్మెల్యే సత్యజిత్‌ విశ్వాస్‌(37)ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. నదియా జిల్లాలోని ఫూల్బరిలో శనివారం సరస్వతి పూజా కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విశ్వాస్‌ వెంట రాష్ట్ర మంత్రి రత్న ఘోష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర్‌ దత్తా ఉన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత వేదిక దిగుతుండగా కొందరు చాలా సమీపం నుంచి కాల్పులు జరపడంతో విశ్వాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. క్రిష్ణాగంజ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వాస్‌కు ఇటీవలే వివాహమైంది.

ఆయన హత్య వెనక బీజేపీ, తమ పార్టీ మాజీ నాయకుడు ముకుల్‌ రాయ్‌ అనుచరులు ఉన్నారని దత్తా ఆరోపించారు. ఈ ఆరోపణల్ని ఖండించిన బీజేపీ రాష్ట్ర యూనిట్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తృణమూల్‌లోనే అంతర్గత కలహాలున్నాయని తిప్పికొట్టారు. బెంగాల్‌ పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, విశ్వాస్‌ హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని  డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్న నదియాలో మతువా వలసదారుల ప్రాబల్యం ఎక్కువ. ఈ వర్గం వారికి చేరువకావడానికి తృణమూల్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మతువాల కార్యక్రమాలకు విశ్వాస్‌ తరచూ హాజరవుతారనే పేరుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top