కరోనాపై పోరుకు అమ్మ రూ.13 కోట్ల విరాళం | Mata Amritanandamayi Math Donate Rs 13 Crore For COVID-19 Relief | Sakshi
Sakshi News home page

కరోనాపై పోరుకు అమ్మ రూ.13 కోట్ల విరాళం

Apr 13 2020 7:41 PM | Updated on Apr 13 2020 7:51 PM

Mata Amritanandamayi Math Donate Rs 13 Crore For COVID-19 Relief - Sakshi

తిరువనంతపురం: కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పలువురు స్వతహాగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా కరోనా బాధితుల కోసం మాతా అమృతానందమయి దేవి రూ.13 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 కోట్లు ప్రధానమంత్రికి కేర్‌ నిధికి, మరో రూ.3 కోట్లు కేరళ సీఎండీఎఫ్‌ నిధికి అందజేయనున్నారు. మఠం విడుదల చేసిన ప్రకటనలో.. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచం యావత్తు అనుభవిస్తున్న బాధను చూసి మనసు తల్లడిల్లుతోంది. కరోనా వల్ల మృతిచెందిన వారి ఆత్మకు, కుటుంబ సభ్యులకు, ప్రపంచానికి శాంతి​ చేకూరాలని ఆ భగవంతున్ని అమ్మ ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

అమ్మ కోరిక మేరకు అమృత విశ్వవిద్యాలయం, అమృత హాస్పిటల్ కలిసి కరోనాతో ఒత్తిడికి, ఆందోళనకి, కుంగుబాటుకు గురైన వారికి సహాయం అందించడానికి ప్రత్యేకంగా హాట్ లైను ఏర్పాటు చేసినట్లు మాతా అమృతానందమయి మఠం వెల్లడించింది. వైద్యరంగ నిపుణులను కరోనా బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు సమయం కేటాయించాలని అభ్యర్థించారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో కౌన్సిలింగ్‌ కూడా సేవలాగా భావించాలని అన్నారు. చదవండి: కరోనా: హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ. 5 కోట్ల విరాళం

అమృత విశ్వవిద్యాలయంతో పాటు మాతా అమృతానందమయి మఠం.. వివిధ రంగాల్లో వైద్య నిపుణులు, పరిశోధనల ద్వారా మాస్కులు, గౌన్లు, వెంటిలేటర్లు మొదలైనవి తక్కువ ధరలో తయారు చేయడమే కాక, ఐసొలేషన్‌ వార్డ్స్, వైద్య సంబంధిత వ్యర్థాలను శుభ్రపరిచే యూనిట్లు నిర్వహిస్తోంది. క్వారంటైన్‌లో ఉన్న రోగులను దూరం నుంచి పర్యవేక్షించే విధానాన్ని రూపొందించింది. వివిధ రంగాలకు చెందిన 60 మంది నిపుణులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు కోవిడ్‌-19కు సంబంధించిన పాఠ్యాంశాలు నేర్చుకొని వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు.

మఠానికి చెందిన కార్యకర్తలు 101 దత్తత గ్రామాల వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు వారికి తెలియజేస్తున్నారు. కోవిడ్‌-19కి సంబంధించిన అసత్య/తప్పుడు వార్తలు వ్యాపించకుండా చూస్తున్నారు. ఈ గ్రామాల వారికి మాస్కులు కుట్టడంలో శిక్షణ ఇచ్చి, ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా మాస్కులు సరఫరా చేస్తున్నారు. 2005 నుంచి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం, గృహ రుణాలు, ఉచిత వైద్యం, గృహ నిర్మాణం, మొదలైన వాటికి దాదాపు రూ.500 కోట్ల సహాయం మాతా అమృతానందమయి మఠం చేసింది.

కాగా.. మానవాళి జీవనశైలిని మార్చుకొని ప్రకృతితో సామరస్యంగా వ్యవహరించాలని లేదంటే ప్రకృతి వైపరీత్యాలకు గురికావాల్సి వస్తుందని దశాబ్దాలుగా అమ్మ నొక్కి చెబుతున్నారు. మానవుడు ప్రకృతి పట్ల స్వార్థంతో వ్యవహరించడం వల్లనే అంటువ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు, మనం ప్రకృతికి సేవకులం మాత్రమే అనే తత్వాన్ని పెంపొందించుకోవాలని, ప్రకృతి పట్ల వినయంగా, గౌరవంగా, దాసులుగా ఉండేందుకు అభ్యాసం చేయాలన్నారు. ఇప్పటికైనా అహంకరించటం మానుకోవాలి.

ప్రకృతి ముందు మోకరిల్ల వలసిన సమయం వచ్చేసింది. ఇది మనం ప్రకృతి పట్ల చేసిన అపరాధాలకు పరిహారం చెల్లించుకోవలసిన సమయం. ప్రకృతి మనం ఏం చేసినా భరిస్తుంది, బాధించినా క్షమిస్తుంది అనే భయంలేని నిర్లక్ష్య ధోరణి విడనాడాలి. ప్రకృతి మనల్ని మేలుకొని చుట్టూ చూడమంటూ ఆదరిస్తుంది. నిద్రపోతున్న మానవాళిని మేల్కొలపటానికి ప్రకృతి కోవిడ్‌-19 రూపంలో మనకి హెచ్చరికలు జారీ చేస్తోందంటూ ప్రకటనను విడుదల చేశారు. చదవండి: మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement