కర్ణాటక బరిలో నేరస్థులు, కోటీశ్వరులు..!

Many Criminals Contesting In Karnataka Assembly Elections 2018 - Sakshi

బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి..

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ వెల్లడి

 

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,560 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం అంటే, 391 మంది క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న వారు ఉన్నారని, పది శాతం మందిలో అంటే, 254 మందిపై మరీ తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌’ తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. మొత్తం క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న వారిలో నలుగురిపై హత్య కేసులు, 25 మందిపై హత్యాయత్నం కేసులు, 23 మందిపై మహిళలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. 

భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం 224 మంది పోటీ చేస్తుండగా, వారిలో 26 శాతం, అంటే 58 మంది క్రిమినల్‌ కేసులున్నవారు ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున 220 మంది పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం మంది అంటే, 32 మంది క్రిమినల్‌ కేసులున్నవారు ఉన్నారు. జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం లేదా 29 మంది క్రిమినల్‌ కేసులున్న వారే ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో ఒక్కరే ఒకరిపై క్రిమినల్‌ కేసు నడుస్తోంది. 1,090 మంది స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 70 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు లాంటివి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు. 

ఎక్కువ క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు పోటీ పడుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలను ‘రెడ్‌ అలర్ట్‌’ నియోజకవర్గాలుగా ఏడీఆర్‌ సంస్థ గుర్తించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 35 శాతం మంది కరోడ్‌పతులు. వారిలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 94 శాతం మంది, బీజేపీ తరఫున 93 శాతం మంది పోటీ చేస్తుండగా, జేడీఎస్‌ తరఫున 77 శాతం మంది పోటీ చేస్తున్నారు. జేడీయూ తరఫున 52 శాతం, ఆప్‌ తరఫున 33 శాతం మంది కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సరాసరి సగటు ఆస్తులు 38 కోట్ల రూపాయలు కాగా, బీజేపీ అభ్యర్థి సగటు ఆస్తులు 17.86 కోట్ల రూపాయలు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top