కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తన భార్య మృతదేహం ఫొటోను ఫేస్బుక్లో చూసి గుర్తుపట్టాడో భర్త.
కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తన భార్య మృతదేహం ఫొటోను ఫేస్బుక్లో చూసి గుర్తుపట్టాడో భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. మీరట్లో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గత గురువారం రాత్రి కనుగొన్నారు. జింఖానా సమీపంలో ఈ మృతదేహం పడి ఉంది. ఆమెను ఎవరో అత్యంత సమీపం నుంచి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపారు. అయితే ఆమె ఎవరన్న విషయాన్ని గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
దాంతో పోలీసులు ఏం చేయాలో తెలియక, ఆమె మృతదేహాన్ని ఫొటో తీసి, దాన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫొటోను ఒకరి తర్వాత ఒకరుగా చాలామంది షేర్ చేశారు. దాంతో ఎట్టకేలకు ఆమె భర్త విపిన్ ఆ ఫొటోను ఫేస్బుక్లో చూశాడు. నోయిడాకు చెందిన తన భార్య నేహ కొన్నాళ్లుగా కనిపించడం లేదని, ఇప్పుడు ఫేస్బుక్లో ఆమె మృతదేహం కనిపించిందని విపిన్ వాపోయాడు. అయితే, ఇంటినుంచి బయటకు వెళ్లిన నేహ అంతదూరం మీరట్ ఎందుకు వెళ్లింది, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో హత్యకు గురైందన్న విషయాలు మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి.