అల్లుడి మరణంతో ఆగిన మామ గుండె!

man dies with kidney disease - Sakshi

అల్లుడిని కబళించిన  కిడ్నీ వ్యాధి

ఆ వార్త విని ప్రాణాలు  విడిచిన మామ

ఒకేరోజు ఇద్దరూ కన్నుమూత

రోడ్డున పడిన కుటుంబాలు

బొరివంకలో విషాదఛాయలు

తన కుమార్తె జీవితానికి వెలుగు ఇస్తాడనుకున్న అల్లుడు తనకన్నా ముందే చనిపోయాడన్న మరణవార్తను విన్న ఆ మామ తనువుచాలించాడు. కిడ్నీ వ్యాధితో అల్లుడు మృతి చెందగా.. ఆ వార్త విన్న మామ తట్టుకోలేక కన్నుమూశాడు. ఒకే రోజు అల్లుడు, మామ మృతితో ఆ కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయాయి. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొరివంక గ్రామంలో ఈ రెండు హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలావున్నాయి.  

ఒడిశా: కవిటి మండలంలో బొరివంక గ్రామంలో ఒకే రోజు అల్లుడు, మామ మృతి చెందారు. కిడ్నీవ్యాధితో అల్లుడు డొంబురు బిసాయి ప్రాణాలు కోల్పోగా, ఆ వార్త విని తట్టుకోలేక మామ అప్పుడు పురియా తనువుచాలించాడు. గ్రామానికి చెందిన అప్పుడు పురియా తన కుమార్తె కమల బిసాయిను అదే గ్రామానికి చెందిన డొంబురు బిసాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే వీరికి ఎప్పటికీ పిల్లలు కలగకపోవడంతో ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. దీంతో భార్య కమల బిసాయి స్వయంగా తన భర్త జీవితంలో మరో మహిళకు సగభాగమిచ్చి రెండో పెళ్లి చేసింది. ఆ తండ్రీ కూతుళ్ల ఉదార మనస్తత్వానికి దేవుడు సైతం కరుణిస్తూ రెండో పెళ్లి చేసుకున్న డొంబురు బిసాయి భార్య హేమలతకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వీరికి శివకృష్ణ, సాయికృష్ణ అని పేర్లు పెట్టారు.

ఆనందంగా ఉంటున్న ఆ కాపురంలో చేదు వార్త వినాల్సి వచ్చింది. డొంబురు బిసాయికి కిడ్నీ వ్యాధి సోకింది. అతడు ఈ వ్యాధితో బాధపడుతూ ఇటీవల చికిత్స పొందుతున్నాడు. తన కష్టార్జితాన్ని కొంతమొత్తం అమ్మేసి వైద్యం పొందుతున్నాడు. ఉన్న ఫళంగా రెండు రోజుల క్రితం ఇతడు కుప్పకూలిపోయాడు. వెంటనే బల్లిపుట్టుగకు చెందిన ఉద్దానం ఫౌండేషన్‌ అంబులెన్స్‌ సాయంతో అతనిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున డొంబురు బిసాయి కన్నుమూశాడు. ఆ మరణవార్తను తెలుసుకున్న గ్రామంలో ఉన్న మామ అప్పుడు పురియా గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఒకే ఇంటిలో రెండు చావుబాజాలు మోగడంతో గ్రామంలో విషాదవాతావరణం అలుముకుంది. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఇక మాకు దిక్కెవరంటూ రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఇంటికి పెద్ద దిక్కులుగా ఉన్న ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడ్డారు.    ముందుగా మామ అప్పుడు పురియాకు గ్రామస్తుల సహాయంతో అంత్యక్రియలు జరిపారు. అనంతరం విశాఖపట్నం నుంచి తీసుకువచ్చిన డొంబురు బిసాయి మృతదేహానికి తర్వాత గ్రామస్తులంతా వెళ్లి అంత్యక్రియలు జరిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top