జూలై 21న వర్చువల్‌ ర్యాలీ.. ఎన్నికల ప్రచారం ప్రారంభం

Mamata Banerjee Virtual Rally On July 21 - Sakshi

ప్రతి బూత్‌లో 30 మంది హాజరుకావాలి

కోల్‌కతా: కరోనా ఎఫెక్ట్‌తో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు బంద్‌ అయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలను, ప్లీనరీలను కూడా వర్చవల్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చేరారు. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా దీదీ ఒక వర్చువల్‌ ర్యాలీని నిర్వహించనున్నారు. 1988 నుంచి టీఎంసీ ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతుంది. ఇదే రోజున మమత త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. జూలై 21న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మమత ర్యాలీని ఉద్దేశించి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రసంగించి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఈ క్రమంలో 21 నాటి ర్యాలీ గురించి మమత పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు.(రోనా ఎక్స్‌ప్రెస్‌ వ్యాఖ్యలపై దీదీ స్పందన)

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఈసారి జూలై 21ని బహిరంగ ప్రదేశంలో జరుపుకోలేకపోతున్నాము. కాని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నేను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తాను. ప్రజలు బూత్ స్థాయిలో గుమి గూడాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి బూత్‌లో సుమారు 30 మంది హాజరుకావాలి. తర్వాత జెండా ఎగరవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలి. మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను’ అని తెలిపారు. బెంగాల్‌లో సుమారు 80,000 బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్‌లో 30 మంది సమావేశమైతే, సుమారు 2.5 లక్షల మంది పాల్గొనవచ్చు. (క‌రోనా : బెంగాలీల‌కు గుడ్‌న్యూస్)

ర్యాలీని ఉద్దేశించి తృణమూల్ చీఫ్ వర్చువల్ మాధ్యమాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. బీజేపీ ఇప్పటికే ఇలాంటి ర్యాలీలు ఆరు నిర్వహించింది. మొదటి దానిని అమిత్‌ షా నిర్వహించారు. దీనిలో ప్రజలు పాల్గొనడానికి బెంగాల్ అంతటా 70,000 టెలివిజన్ సెట్లను ఏర్పాటు చేశామని బీజేపీ పేర్కొన్నది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. తృణమూల్ వద్ద ఆ రకమైన డబ్బు లేదు అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top