
'సుష్మ, రాజే వైదొలగాల్సిందే'
లలిత్‌మోదీ వ్యవహారంలో దోషులైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తక్షణమే పదవుల నుంచి వైదొలగాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
పార్లమెంటులో నిలదీస్తామని హెచ్చరిక నీతులు చెప్పే నరేంద్రమోడీ
మౌనమెందుకు ? మోదీ కార్మిక వ్యతిరేకి
ఐఎన్‌టీయూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే
హైదరాబాద్: లలిత్‌మోదీ వ్యవహారంలో దోషులైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తక్షణమే పదవుల నుంచి వైదొలగాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అఖిలభారత ఐఎన్‌టీయూసీ సమావేశం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. అవినీతి రహితంగా సుపరిపాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్రమోదీ ఏడాదిపాలన పూర్తికాకముందే నలుగురు బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లలిత్‌మోదీ వ్యవహారంలో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా సుష్మా స్వరాజ్‌పై, వసుంధర రాజే మీద రోజూ విమర్శలు వస్తున్నా.. ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నాడని ఖర్గే ఈ సందర్భంగా ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వంలో అవినీతి పరులపై ప్రధానమంత్రి మోదీ మౌనాన్ని పార్లమెంటులో నిలదీస్తామని ఖర్గే హెచ్చరించారు. సామాన్యులను, కార్మికులను బీజేపీ మోసగిస్తున్నదని ఆయన విమర్శించారు. కేవలం బడా వ్యాపారులను, బహుళజాతి కంపెనీలను, పారిశ్రామికవేత్తలను దగ్గర పెట్టుకుంటున్న ఎన్డీయే ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. కార్మిక వ్యతిరేకిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నాడని ఖర్గే విమర్శించారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, పనిలో రక్షణకోసం కాంగ్రెస్ హయాంలో అనేక విప్లవాత్మక చట్టాలను తెచ్చామని చెప్పారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం అంబానీ, అధానీలకు తప్ప సామాన్యులకు, కార్మికులకు ఉపయోగపడే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
కార్మిక, కర్షక చట్టాలను వ్యాపారులకు అనుకూలంగా, వారికే మేలు చేసే విధంగా మారుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవడానికి, భూములపై రైతులకు హక్కుల్లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతాంగానికి శాశ్వతంగా తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరించి, కార్మిక వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడటానికి ఐఎన్‌టీయూసీ అగ్రభాగాన ఉంటుందని స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మెకు పిలుపును ఇస్తున్నట్టుగా ఖర్గే ప్రకటించారు. నవంబరు 23న రైల్వే సమ్మెకు పిలుపును ఇచ్చారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని, కార్మిక హక్కులకోసం చేస్తున్న పోరాటాల్లో కార్మికులంతా ముందుండాలని ఖర్గే సూచించారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక సంక్షేమం కోసం పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కేవలం బడా వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు కొమ్ముగాస్తున్నదని విమర్శించారు. కార్మిక సంక్షేమంకోసం పోరాడుతున్న కార్మికసంఘాలు చేసే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జనక్ ప్రసాద్, టీపీసీసీ కార్మిక విభాగం అధ్యక్షుడు ఆర్.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.