పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్‌

Madhya Pradesh CM Kamal Nath Comments on Jyotiraditya Scindia - Sakshi

సాక్షి, ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో వివాదాలపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ స్పందించారు. ఇలాంటివి తమ పార్టీలోనే కాదు ప్రతీ పార్టీలోనూ ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడారు. జ్యోతిరాదిత్య సింధియాతో విభేదాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. అదేం పెద్ద సమస్య కాదని కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ పదవిని సింధియాకు ఇచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు ఎందుకుఇవ్వకూడదని తిరిగి ప్రశ్నించారు. ఆయనకు అనుభవముంది. నాయకత్వ లక్షణాలున్నాయి. తనకంటూ ఓ టీమ్‌ ఉందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ పదవి ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉంది. 

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న సింధియా సీఎం కావాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం కమల్‌నాథ్‌ను ఎంపిక చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు సింధియా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు. ఇది సింధియాకు మైనస్‌గా మారిందని పార్టీ వర్గాల సమాచారం. అంతేకాక ఇటీవల వచ్చిన వర్షాలకు మధ్యప్రదేశ్‌లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ విషయంలో ప్రభుత్వ చర్యల పట్ల సింధియా అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద ప్రభావంపై వెంటనే సర్వే నిర్వహించి బాధితులను ఆదుకోవాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ విషయం కమల్‌నాథ్‌ ముందుంచగా, రుతుపవనాలు ఇంకా తిరుగుముఖం పట్టలేదు. ఇప్పుడు సర్వే నిర్వహించినా తర్వాత మళ్లీ వరదలొస్తే రీసర్వే నిర్వహించమని డిమాండ్‌ చేస్తారు. అలా కాకుండా పరిస్థితులు సద్దుమణిగాక ఒకే సారి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై కమల్‌నాథ్‌ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top