‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’ | Sakshi
Sakshi News home page

‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’

Published Sun, May 14 2017 7:11 PM

‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’

న్యూఢిల్లీ: అమర జవాను ఇంటికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి వస్తున్నారని చేసిన ఏర్పాట్లన్ని ఆయన వెళ్లిపోయిన మరుక్షణమే తీసుకొని వెళ్లిపోయారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్‌ సేనలు చేసిన అక్రమ దాడుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌ సాగర్‌ వీరమరణం పొందాడు. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ వచ్చారు. అయితే, ఆయన రావడానికంటే ముందే, ఆ ఇంట్లోకి ఏసీలు, సోఫాలు, కర్టన్లు, కార్పెట్లు, కుర్చీలు తీసుకొచ్చి ఇంటినిండా నింపారు.

దీంతో ఆ వస్తువులన్నీ వారికి తీసుకొచ్చారని ఆ గ్రామస్తులతోపాటు ఇంటివారు కూడా అనుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి వెళ్లిపోగానే చిన్నవస్తువుతో సహా ప్రతి ఒక్కటి అధికారులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశలోకి కూరుకుపోవడమే కాకుండా అవమానభారంలోకి జారుకుంది. ‘ఏసీ, సోఫా సెట్లు, కార్పెట్‌, కుర్చీలు ముఖ్యమంత్రి వస్తున్నారని తీసుకొచ్చి ఇంటినిండా పెట్టారు. సీఎం వెళ్లిపోగానే మొత్తం తీసుకెళ్లారు’ అని జవాను సోదరుడు దయాశంకర్‌ అన్నారు. ఈ చర్య తమను తీవ్రంగా అవమానించినట్లుగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement