రాఫెల్‌ డీల్‌ : రాహుల్‌కు అంబానీ లేఖ | In letter to Rahul Gandhi, Anil Ambani explains why Reliance got Rafale contract | Sakshi
Sakshi News home page

రాఫెల్‌ డీల్‌ : రాహుల్‌కు అంబానీ లేఖ

Jul 26 2018 12:34 PM | Updated on Jul 26 2018 8:08 PM

In letter to Rahul Gandhi, Anil Ambani explains why Reliance got Rafale contract - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రాఫెల్‌ కుంభకోణం వివాదం  బీజేపీ సర్కార్‌ను చిక్కుల్లో నెట్టింది.  రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలకు  దిగారు. ఈ నేపథ్యంలో  ఈ వ్యవహారంలో  భారీగా లబ్ది పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ గతంలో రాసిన ఒక లేఖ  ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీ,  రాహుల్‌ వ్యాఖ్యలకు స్పందించిన  అంబానీ  గత ఏడాది డిసెంబర్‌లో   ఈ లేఖ రాశారు. 

డసాల్ట్‌ కంపెనీ, రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌గా  ఏర్పడటంలో ప్రభుత్వం పాత్ర ఎంత మాత్రం లేదని  అంబానీ వివరణ ఇచ్చారు. ఇది రెండు కార్పొరేట్‌ కంపెనీల మధ్య కుదిరిన ప్రయివేటు ఒప్పందని  తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వంపై  రాహుల్‌ విమర్శలు గుప్పించడం వ్యక్తిగతంగా  తనను చాలా బాధించిందని అనిల్‌ అంబానీ పేర్కొన్నారు.  అంతేకాదు తమ కుటుంబానికి గాంధీ కుటుంబంతో గత నాలుగు దశాబ్దాలుగా  గౌరవనీయ సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.  తనపైనా, తన కుటుంబంపైనా  కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి  వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. అలాగే రక్షణ రంగంలో తమ కంపెనీ అనుభవం లేదన్న విమర్శలను  ఆయన తిప్పి కొట్టారు. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్, పలు రక్షణ ప్రాంతాల్లో లీడర్‌గా వెలుగొందుతోందనీ,  గుజరాత్‌లోని పిపావావ్‌ ప్రైవేటు రంగంలో అతిపెద్ద  షిప్‌ యార్డ్‌ తమ సొంతమని చెప్పారు. భారత నావికాదళంలో ఐదు నావెల్ ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సల్స్ నిర్మాణంతోపాటు, ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌కు సంబంధించి మొత్తం 14 ఫాస్ట్ పెట్రోల్ వెస్సల్స్ నిర్మించడంలో తమ సంస్థ పాల్గొందని అనిల్ అంబానీ లేఖ ద్వారా తెలిపారు.  అమెరికా నేవీకి చెందిన వంద నౌకల నిర్వహణ కాంట్రాక్టు తమకే దక్కిందన్నారు.

కాగా  రిలయన్స్‌ కంపెనీ యజమాని అనిల్‌ అంబానీకి లాభం చేకూర్చేలా రాఫెల్‌ జెట్ల కొనుగోలు ధరను ఎన్‌డీయే ప్రభుత్వం అమాంతం పెంచేసిందన్నది కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ఆరోపణ. రాఫెల్‌ డీల్‌ ఒక భారీ కుంభకోణమనీ,  ఇందులో మోదీ మ్యాజిక్‌ ఉందంటూ రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు.  35వేల కోట్ల  రూపాయల అప్పుల్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు రూ.45వేల కోట్ల లబ్ధి చేకూర్చారనీ, ‘ఓ వ్యాపారవేత్త’కు లబ్ధి చేకూర్చడానికే గతంలో యూపీఏ చేసిన ఒప్పందాన్ని రద్దు చేసి తాజా డీల్‌ కుదుర్చుకున్నారని  రాహుల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు  ప్రభుత్వ రంగ కంపెనీ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ను ఎందుకు  పక్కనపెట్టారో చెప్పాలని  రాహుల్‌ గాంధీ  ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement