’లాంగ్‌ లీవ్‌’ ఎంపీలు...!

Leave Application To Parliament By MPs - Sakshi

అనుమతి లేకుండా ఆరునెలల పాటు వరసగా పార్లమెంట్‌కు గైర్హాజర్‌ అయితే ఆ ఎంపీ లేదా ఎంపీలపై అనర్హత వేటు వీలు  భారత రాజ్యాంగం కల్పించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం సభకు హాజరయ్యేందుకు పరిస్థితులు అనుకూలించని పార్లమెంట్‌ సభ్యులు (లోక్‌సభ, రాజ్యసభ)సెలవు చీటీలు సమర్పిస్తున్నారు. ప్రస్తుత 16వ లోక్‌సభలో ఈ ఏడాది మార్చి వరకు 41 మంది సభ్యులు ఈ విధంగా 60 లీవ్‌లెటర్లు అందజేశారు. ఇప్పటివరకు ఈ లీవ్‌ లెటర్లన్నీ కలిపితే వీరంతా 1800 రోజుల కంటే ఎక్కువగానే సెలవులు కోరినట్టు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో మొత్తం కలిపి 300 రోజుల వరకు లోక్‌సభ సమావేశమైంది. ఎంపీల సగటు అటెండెన్స్‌ శాతం 80 శాతం వరకు ఉన్నట్టు పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చ్‌ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 

అత్యధికంగా బీజేపీ సభ్యులు..
13 రాజకీయపార్టీలకు చెందిన ఎంపీలు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. మొత్తం 60 లీవ్‌ లెటర్లలో అత్యధికంగా  బీజేపీ నుంచి 21,   తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి 13,   బీజేడీ నుంచి 7,  కాంగ్రెస్‌ నుంచి 4, ఎన్‌సీపీ, వైఎస్సార్‌సీపీ (టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డితో సహా)ల నుంచి ముగ్గురేసి చొప్పున, పీడీపీ, టీడీపీల నుంచి ఇద్దరేసి చొప్పున, పీఎంకే, ఎన్‌పీఎఫ్,ఎల్‌ఐపీ, జేఎంఎం, సీపీఎంల నుంచి ఒక్కరి చొప్పురన దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.

అత‍్యధికులు అనారోగ్య కారణంగా...
మొత్తం 60 దరఖాస్తుల్లో 32 అనారోగ్యాన్ని కారణంగా చూపారు. వారిలో ఓ బీజేపీ ఎంపీ మాత్రమే తన కుటుంబంలో అనారోగ‍్యంగా ఉన్న వారి కోసం సెలవు కావాలని కోరగా, మిగతా వారంతా కూడా తమ అనారోగ్యానికే  లీవ్‌ దరఖాస్తు చేసుకున్నారు. తమ నియోజకవర్గంలో ఎన్నికలను పది దరఖాస్తుల్లో  కారణంగా చూపారు.నియోజకవర్గ సంబంధిత పనుల కారణంగా సెలవు ఇవ్వాలంటూ మూడు లెటర్లు వచ్చాయి. విదేశాల్లో పర్యటనను గురించి మూడు దరఖాస్తులో‍్ల ప్రస్తావించారు. వారిలో బీజేపీ ఎంపీ, సినీనటి హేమామాలిని ఒకరు. విదేశాల్లో బోధనా విధుల కోసం సెలవు కావాలని   ఓ తృణమూల్‌ ఎంపీ  కోరాడు. విదేశీ పర్యటన, కుటుంబంలో వివాహం, నియోజకవర్గంలో సహాయకార్యక్రమాలు ఇలా అనేక కారణాలను మరో తృణమూల్‌ ఎంపీ పొందుపరిచారు. కుటుంబ సభ్యుల మరణాన్ని ఇద్దరు ఎంపీలు కారణంగా చూపారు. అనారోగ్యకారణంగా సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న బీజేపీ సభ్యులు వినోద్‌ ఖన్నా, చాంద్‌నాథ్‌ యోగి, తృణమూల్‌ ఎంపీ కపిల్‌కుమార్‌ ఠాకూర్‌ కన్నుమూశారు.

ఎంపీల సెలవు దరఖాస్తుల్లో నాలుగింట్లో మాత్రమే సభ్యులు కోరినన్నీ సెలవులు  కమిటీ సిఫార్సు చేయలేదు.  కాంగ్రెస్‌ ఎంపీ అమరీందర్‌సింగ్ (ప్రస్తుత పంజాబ్‌ సీఎం) కు 59 రోజుల సెలవు సిఫార్సు చేసి, కోరుకున్న మిగతా రోజులకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించింది. మరో ఎంపీ ఎస్‌పీవై రెడ్డి దరఖాస్తు విషయంలోనూ ఇదే జరిగింది. జైల్లో ఉన్న బీజేడీ ఎంపీ రామచంద్ర హాంద్సా కు 67 రోజుల లీవ్‌ తిరస‍్కరించింది. ఈ ఎంపీనే అత‍్యధికంగా 299 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా, బీజేపీ ఎంపీ చాంద్‌నాథ్‌ 164 రోజులు, మరో ఏడుగురు ఎంపీలు 50 రోజులకు పైగా లీవ్‌ కోసం లెటర్‌ పెట్టుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top