
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో భాగమైన రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు అక్రమాల కేసులో నిందితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం ఏకంగా ఏడు గంటలపాటు విచారించింది. గురువారం కూతురు మీసా భారతితో కలసి లాలూ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.
భారతిని లాబీలో వేచి ఉండమని చెప్పి లాలూను అధికారులు సుదీర్ఘంగా విచారించారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా 2006నాటి రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు ఒప్పందంలో లొసుగులు, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ యజమానులతో సత్సంబంధాలు, లావాదేవీలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. లాలూ కొడుకు తేజస్విని సీబీఐ అధికారులు శుక్రవారం ప్రశ్నించనున్నారు.