ఆక్సిజన్‌ సిలిండర్‌తో సివిల్స్‌ పరీక్ష

Kerala woman writes civil services exam with oxygen cylinder - Sakshi

తిరువనంతపురం: ఓ సివిల్స్‌ అభ్యర్థి తపనను అనారోగ్యం కూడా అడ్డుకోలేకపోయింది. ఎముకల వ్యాధితో బాధ పడుతున్నా, ఆక్సిజన్‌ సిలిండర్‌ సహాయంతో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి అందరి చేత శభాష్‌ అనిపించుకుంది. కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(24) పుట్టినప్పటి నుంచి టైప్‌ –2 ఆస్టియోజెనెసిస్‌ ఇంపర్‌ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. అలాగే పల్మనరీ హైపర్‌ టెన్షన్‌  వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం ఏర్పడింది. అయినప్పటికీ సివిల్స్‌ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్‌ సిలిండర్‌ల సాయంతో ఆమె ఆదివారం నిర్వహించిన సివిల్స్‌ ప్రాథమిక పరీక్షకు హాజరయింది. పరీక్ష అనుమతి కోసం ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్‌ సుధీర్‌బాబుకు అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. లతీషా ఎం.కాం. వరకు చదువుకుందని అన్సారీ వెల్లడించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top