
టెక్ గ్రాడ్యుయేట్ల చూపు హ్యుమానిటీస్ వైపు..
అకడమిక్స్‌లో ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్.. ఆప్షనల్స్‌లో మాత్రం హ్యుమానిటీస్..
సివిల్స్ అభ్యర్థుల్లో 85% మంది ఎంపిక అవే.. వనరుల లభ్యత, శిక్షణ సదుపాయమే కారణం
సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా పలు అఖిల భారత సర్విసులకు అభ్యర్థులను ఎంపిక చేసే అత్యంత క్లిష్టమైన ఎంపిక ప్రక్రియ. ఈ ప్రక్రియలో జనరల్ స్టడీస్ నుంచి ఆప్షనల్ సబ్జెక్ట్ వరకు అన్నిటిపై.. అభ్యర్థులకు ఉన్న అవగాహనను లోతుగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఇందులో పొందే మార్కులే తుది విజయాన్ని నిర్దేశిస్తున్న పరిస్థితి. దీంతో అకడమిక్‌గా టెక్నికల్, సైన్స్, మెడిసిన్ వంటి నాన్–ఆర్ట్స్ నేపథ్యాల అభ్యర్థుల్లో 85 శాతం మంది హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌లనే ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటున్నారు. ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నారు. వీళ్లంతా అంతవరకు తాము చదువుకున్న సబ్జెక్ట్ వదిలేసి.. అందుకు భిన్నంగా హ్యుమానిటీస్ వైపు ఎందుకు మళ్లుతున్నారు.. ఎలా విజయం సాధిస్తున్నారు.. ఈ కారణాలపై విశ్లేషణ. ..: సాక్షి, స్పెషల్ డెస్క్ :..
⇒ శక్తిదూబె.. సివిల్స్–2024 లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీ పూర్తి చేసుకున్న ఆమె.. సివిల్స్‌లో మాత్రం ఆప్షనల్ సబ్జెక్ట్‌గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకున్నారు.
⇒ తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని ఎలక్ట్రానిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేసి.. ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నారు.
⇒ ఇంజనీరింగ్, సైన్స్ నేపథ్యాల అభ్యర్థులు.. సివిల్స్‌లో ఆప్షనల్ విషయంలో మాత్రం హ్యుమానిటీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి మచ్చుకు రెండు ఉదాహరణలివి. వీరిద్దరే కాదు.. 2017 నుంచి 2021 వరకు 76% మంది టెక్, సైన్స్, మెడిసిన్ నేపథ్యాల విజేతలు కాగా.. వీరిలో 85% మంది హ్యుమానిటీస్‌ను ఆప్షనల్‌గా
ఎంచుకోవడం విశేషం.
వనరుల లభ్యతే కారణం..
హ్యుమానిటీస్‌ను ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటున్న వారు సైతం.. అందులో నాలుగు సబ్జెక్ట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా హ్యుమానిటీస్ విభాగంలోని ఒక సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న అంశం.. వనరుల లభ్యత. సివిల్ సర్విసెస్ ఎంపిక ప్రక్రియలో రెండో దశలోని మెయిన్స్‌లో రెండు పేపర్లుగా 500 మార్కులకు ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి పరిపూర్ణ అవగాహన తప్పనిసరి.
మెటీరియల్ లభ్యత, శిక్షణ సదుపాయం విషయంలో హ్యుమానీటీస్ సబ్జెక్ట్‌లకు సంబంధించి పుష్కలమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. కోచింగ్ ఫ్యాకల్టీలో సైతం 90 శాతం మంది ఈ సబ్జెక్ట్‌లలోనే అందుబాటులో ఉంటున్నారు. విశ్లేషణాత్మక వ్యక్తీకరణ సులభంగా ఉండడం కూడా ఈ సబ్జెక్ట్‌లను ఎంచుకోవడానికి కారణమని విజేతలు, కోచింగ్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. న్యూమరికల్ పాఠ్యాంశాలు ఉండే మ్యాథ్స్, సైన్స్‌లు సహనానికి పరీక్షగా మారుతున్నాయి.
జీఎస్ పేపర్లకు సమయం ఆదా..
హ్యుమానిటీస్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవడం వల్ల అభ్యర్థులకు కలిసొస్తున్న మరో అంశం.. జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్(జీఎస్) పేపర్లకు సమయం ఆదా చేసుకునే అవకాశం. ఒక జనరల్ ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఉండే మెయిన్స్ పరీక్షలో అత్యధిక శాతం అంశాలు సమకాలీన, భౌగోళిక అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు, పరిపాలన, చరిత్ర, ఆర్థిక అంశాల నుంచే ఉంటున్నాయి. దీంతో హ్యుమానిటీస్‌లోని ఏ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకున్నా.. ఎస్సే, జీఎస్ పేపర్లతో కలిపి చదివే అవకాశం ఉంటోంది. సివిల్స్ మెయిన్స్ ఆప్షనల్స్ విషయంలో హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌లైన ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మిని్రస్టేషన్, సోషియాలజీ, పాలిటీలకు ఎప్పటి నుంచో స్కోరింగ్ సబ్జెక్ట్‌లనే పేరుంది.
విధుల్లోనూ ఉపయోగం
హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌ను ఎంచుకుంటే.. భవిష్యత్తులో సివిల్ సర్విస్ అధికారులుగా నిర్వర్తించాల్సిన విధుల విషయంలోనూ స్పష్టత ఏర్పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు పాలిటీ, గవర్నెన్‌్స, ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్ వంటి అంశాలనే పరిగణనలోకి తీసుకుంటే.. పాలన పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పాలనా దక్షతకు సంబంధించిన అంశాలతో సిలబస్‌ను కూర్చారు. దీనిపై పట్టు సాధించడం ద్వారా విజేతలుగా నిలిస్తే భవిష్యత్తులో విధి నిర్వహణలోనూ సమర్థవంతంగా వ్యవహరించొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలోని రెండో దశ మెయిన్స్‌లో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. వీటిలో రెండు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–1, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–2గా ఉంటాయి. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా యూపీఎస్సీ 2025 పేర్కొన్న 26 సబ్జెక్ట్‌ల నుంచి ఒక సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవాలి. మొత్తం 1,750 మార్కులకు ఉండే మెయిన్స్ పరీక్షలో ఆప్షనల్ సబ్జెక్ట్‌కే 29 శాతం వెయిటేజీ ఉంటోంది.
నాలుగైదు నెలల్లో పట్టు సాధించే అవకాశం
⇒ హ్యుమానిటీస్ ఆప్షనల్స్ విషయంలో అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. మంచి గ్రాహక శక్తి ఉన్న అభ్యర్థి నాలుగైదు నెలల్లో సంబంధిత సబ్జెక్ట్‌లో పట్టు సాధించే అవకాశం ఉండడమే. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు అకడమిక్ అభ్యసనం కోణంలో స్వతహాగా అనలిటికల్ స్కిల్స్ లభిస్తున్నాయి. ఇది కూడా వారికి కలిసొస్తున్న అంశమే. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ ఐఏఎస్ అకాడమీ
సక్సెస్ రేటు..
2017 నుంచి 2021 వరకు సివిల్స్‌లో ఇంజినీరింగ్ అకడమిక్ నేపథ్యం ఉన్న 63.7%అభ్యర్థులు పరీక్షలు రాస్తే.. ఇంజినీరింగ్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుని విజేతలైంది మాత్రం కేవలం 5.5%.
మన దృక్పథాన్ని విశ్లేషించే అవకాశం
⇒హ్యుమానిటీస్ ఆప్షనల్స్ విషయంలో సమాధానం ఇచ్చేటప్పుడు మన దృక్పథాన్ని, అప్పటి వరకు చదివిన అంశాలను పూర్తి స్థాయిలో విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ సబ్జెక్ట్స్‌కు లోతైన అవగాహన అవసరం. సివిల్స్ ప్రిపరేషన్ గడువుతో పోల్చుకుంటే ఇది కొంత కష్టమైన ప్రక్రియ. అందుకే టెక్ నేపథ్యం ఉన్న వారు హ్యుమానిటీస్‌ను ఆప్షనల్‌గా ఎంచుకుంటున్నారు. అలాగే హ్యుమానిటీస్ విషయంలో కోచింగ్ తీసుకోలేని వారికి కూడా విస్తృతమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడమూ సులభం. నా ఆప్షనల్ ఆంత్రోపాలజీ పరిధి ఎక్కువే అయినప్పటికీ.. సిలబస్‌లోని అంశాలను బేరీజు వేసుకుని చదివాను. – ఇ. సాయి శివాని, సివిల్స్–2024లో 11వ ర్యాంకు (తెలుగు రాష్ట్రాల్లో టాపర్)
సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్ – 2024 గణాంకాలు
⇒ 5.8లక్షలు హాజరైన అభ్యర్థులు
⇒ 14,627 మెయిన్స్‌కు ఎంపికైన వారు
⇒ 2,845 ఇంటర్వ్యూకు ఎంపికైన వారు
⇒ 1009 విజయం సాధించిన వారు