
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలవుతుండగా ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా?
కొట్టాయం: ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పోప్ ఫ్రాన్సిస్ వీరంతా కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలవుతుండగా ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? దీనికి గురించి తెలుసుకోవాలంటే కేరళలోని ఎలక్కాడ్ ప్రాంతానికి వెళ్లాలి. స్థానిక సెయింట్ మెరీస్ చర్చిలో ఆదివారం వీరి అట్ట బొమ్మలను కుర్చీల్లో పెట్టారు. తర్వాత ఈ బొమ్మలకు చర్చి ఫాదర్ పాల్ చలవీటిల్ శాలువాలు కప్పి సన్మానం చేశారు.
‘కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోదీని సముచితంగా అభినందించాలని అనుకున్నాం. కేరళలో కోవిడ్ నివారణ చర్యలకు సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇతరులకు ధన్యవాదాలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ బొమ్మల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామ’ని పాల్ తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధుల బొమ్మలకు కూడా ఈ సందర్భంగా సన్మానం చేశారు. చర్చి ద్వారా సేకరించిన లక్ష రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు పాల్ తెలిపారు.