ఐయామ్‌ మెంటల్లీ ఫిట్‌, పరీక్షలు వద్దు | Karnan refuses medical examination, says 'am mentally fit' | Sakshi
Sakshi News home page

ఐయామ్‌ మెంటల్లీ ఫిట్‌, పరీక్షలు వద్దు

May 4 2017 3:25 PM | Updated on Oct 9 2018 7:05 PM

ఐయామ్‌ మెంటల్లీ ఫిట్‌, పరీక్షలు వద్దు - Sakshi

ఐయామ్‌ మెంటల్లీ ఫిట్‌, పరీక్షలు వద్దు

కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌.కర్ణన్‌ గురువారం వైద్య పరీక్షలకు నిరాకరించారు.

కోల్‌కతా: కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌.కర్ణన్‌ గురువారం వైద్య పరీక్షలకు నిరాకరించారు. తన మానసిక స్థితి బాగానే ఉందని, తాను మంచిగానే ఉన్నానని ఆయన అన్నారు. కాగా  కర్ణన్‌ మానసిక పరిస్థితిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో నలుగురు సభ్యుల వైద్య బృందం గురువారం ఉదయం జస్టిస్‌ కర్ణన్‌ నివాసానికి వెళ్లింది. అయితే ఆయన మాత్రం వైద్య పరీక్షలను తిరస్కరించారు.  

ఒక జడ్జిని చులకన చేయటంతోపాటు వేధించేలా సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని కర్ణన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటువంటి వైద్య పరీక్షలను చేపట్టే సమయంలో సంరక్షకుల సమ్మతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని, అయితే తన  కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరని, వారి సమ్మతిని తీసుకునే వీలులేనందున తనకు ఏ విధమైన వైద్య పరీక్షలు చేయడానికి వీల్లేదని వైద్యులకు స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా తనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే అది చట్టవిరుద్దమని కర్ణన్‌ పేర్కొన్నారు.
కోల్‌కతా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్య బృందంతో జస్టిస్‌ కర్ణన్‌ మానసిక స్థితిని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 8వ తేదీలోగా న్యాయస్థానానికి నివేదిక సమర్పించాలని సూచించింది. వైద్య బృందానికి అవసరమైన సాయం అందించేందుకు పోలీసు అధికారుల బృందాన్ని కూడా వెంట పంపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ కేహార్‌ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

కాగా దేశవ్యాప్తంగా కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు అవినీతిపరులంటూ జస్టిస్‌ కర్ణన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం మార్చిలో విచారణ చేపట్టగా.. కర్ణన్‌ హాజరు కాలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అయితే దీనికి కూడా కర్ణన్‌ స్పందించలేదు సరికదా.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే సమన్లు జారీ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement