ఎన్నార్సీ లేని ఎన్పీఆర్‌ ఓకే

Kamal Nath says Congress wanted NPR sans NRC - Sakshi

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ వ్యాఖ్య

సీఏఏకు వ్యతిరేకంగా భోపాల్‌లో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ

భోపాల్‌/బెంగళూరు/లక్నో/ వాషింగ్టన్‌: జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) బదులు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) అమలు చేయాలని తమ పార్టీ కోరుకుంటోందని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ప్రకటించారు. ఎన్పీఆర్‌తో కలిపి ఎన్నార్సీని చేపట్టడంపై వెనుక మోదీ ప్రభుత్వ ఉద్దేశాలపై∙అనుమానం వ్యక్తం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా భోపాల్‌లో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఏఏలో లొసుగులున్నాయి. ఎన్పీఆర్‌ను మేం కోరుకుంటున్నాం. అయితే, ఎన్నార్సీతో కలిపి కాదు. కేంద్రం రెంటినీ కలిపి తేవడం వెనుక కేంద్రం ఉద్దేశం స్పష్టమవుతోంది. సీఏఏ, ఎన్నార్సీ వంటి చట్టాలు గతంలో ఎన్నడూ లేవు’ అని అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోదన్నారు.

అపోహలు దూరం చేసేందుకు: దుష్ప్రచారం, అపోహల కారణంగానే భారత్‌లో ఎన్నార్సీ, సీఏఏపై ఆందోళనలు చెలరేగాయంటూ భారతీయ అమెరికన్లు పేర్కొన్నారు. అమెరికాలోని పలు నగరాల్లో ఎన్నార్సీ, సీఏఏ అనుకూల ర్యాలీలు చేపట్టారు. డల్లాస్, షికాగో, శాన్‌ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటా, శాన్‌జోస్‌ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముస్లింలను భారత్‌ నుంచి వెళ్లగొడతారనే అపోహలు, వామపక్ష సంస్థల ప్రచారం కారణంగా భారత్‌లో నిరసనలు జరుగుతున్నాయని వినీత్‌  అనే నిర్వాహకుడు తెలిపారు.

పథకం ప్రకారం అల్లర్లు: మంగళూరులో పోలీసుల కాల్పుల ఘటనపై దర్యాప్తు నివేదిక అందే వరకు కాల్పుల్లో మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని నిలిపివేస్తున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ‘నేరస్తులకు పరిహారం క్షమార్హం కాని నేరం. మంగళూరు అల్లర్లు పథకం ప్రకారం జరిగాయి. ఆనాడు ఆందోళనకారులు పోలీస్‌ స్టేషన్‌లోకి వచ్చి ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. వారిని వదలం’ అని అన్నారు.

60 మందికి యూపీ సర్కారు నోటీసులు
సీఏఏకి వ్యతిరేకంగా రాంపూర్, గోరఖ్‌పూర్‌లలో జరిగిన ఆందోళనల్లో హింసకు కారణమైన 60 మందికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన అధికారులు..అల్లర్ల కారణంగా రూ.25 లక్షల మేర ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. దీంతో ఇందుకు కారణమైన 28 మందికి బుధవారం నోటీసులిచ్చారు. దీనిపై వారు వారంలోగా వివరణ అయినా ఇవ్వాలి లేదా నష్టాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. లేకుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు కారకులుగా గుర్తించిన 33 మందికి పోలీసులు నోటీసులిచ్చారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top