సీజేగా బాబ్డే ‍ప్రమాణ స్వీకారం

Justice SA Bobde Sworn As 47th Chief Justice Of India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే (63) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2021 ఏప్రిల్‌ 23 వరకు 17 నెలల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సుప్రీంకోర్టు మాజీ సీజే రంజన్‌ గొగోయ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఎల్‌కే అద్వానీ, జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అనంతరం వారంతా బాబ్డే శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ బాబ్డే కూడా ఉన్నారు. మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాబ్డే. తన తర్వాత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ బాబ్డే పేరును చీఫ్‌ జస్టిస్‌గా గొగోయ్‌ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే.

చీఫ్‌ జస్టిస్‌గా రంజన్‌ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్‌ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌లో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు.  2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్‌ 16న మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ ఆదివారం రిటైరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top