విద్యార్థి కంటి చూపును హరించిన పోలీసులు

Jamia Student Lost Eye Sight In Police Lathi Charge - Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీ కారణంగా మాస్టర్‌ ఆఫ్‌ లా (ఎల్‌ఎల్‌ఎమ్‌) విద్యార్థి మిన్‌హాజుద్దీన్‌ తన చూపు కొల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే  డిసెంబరు 15న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఆయుధాలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసులు విద్యార్థులను కొడుతున్న వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా మూడు రోజుల తర్వాత పోలీసులు జరిపిన లాఠీ  చార్జీ కారణంగా జామియా యూనివర్సిటీ ఫైనలియర్‌ స్టూడెంట్‌  మిన్‌హాజుద్దీన్‌ (26) ఒక కంటికి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఇక రెండో కంటిపై కూడా దాని ప్రభావం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆవేదన చెందుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం తాను లైబ్రరీలోని ఎంఫిల్‌ సెక‌్షన్‌లో చదువుకుంటుండగా.. 25మందికి పైగా సాయుధులైన పోలీసులు లాఠీలతో విద్యార్థులపై దాడికి దిగారు. తన ఒక కంటికి, చేతికి తీవ్ర గాయాలవడంతో..  పారిపోయి టాయిలెట్‌లో దాక్కుని అక్కడే స్పృహ కోల్పోయానని వివరించాడు. ఆ తర్వాత తన స్నేహితులు కొంతమంది ఎయిమ్స్‌కు, రాజేంద్ర ప్రసాద్‌ ఐ ఇన్సిట్యూట్‌కు చేర్చారని అన్నాడు. పోలీసులు కాల్పులు జరపడం, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో వైరల్‌ అయిన వీడియోల్లో విద్యార్థుల అర్తనాదాలు, లైబ్రరీలో పుస్తకాలు చెల్లాచెదురు కావడం గమనించవచ్చు.

ఇక పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై సీనియర్‌ పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. జామియా విద్యార్థులపై అవసరానికి మించి బలప్రయోగం, యూనివర్సిటీ క్యాంపస్‌లోకి అక్రమంగా చొరబడటం అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఒక గుంపు లోపలికి వెళ్ళిన తర్వాతే పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఇక హోం మంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసులు పంపిన రిపోర్టులో కాల్పులు జరుపలేదని పేర్కొన్నట్లుగా సమాచారం. అయితే పోలీసులు జరిపిన కాల్పుల కారణంగా బుల్లెట్‌ గాయాలతో ఇద్దరు విద్యార్థులు సప్ధార్‌ జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం విద్యార్థులు  ప్రశాంతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో స్థానిక ముఠాలు ప్రేరేపిస్తున్నాయనే నెపంతో హింసాత్మకంగా మార్చారు.

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన దమనకాండలో విద్యార్ధులను మినహాయించి 14 మంది స్ధానికులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిలో ఇప్పటివరకు ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరు మంది ప్రాణాలు విడిచారు. కాగా ఢిల్లీలో నిరసనల హోరు కారణంగా గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండడంతో.. ఏకంగా కొన్ని రోడ్లనే మూసివేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top