శ్రీనగర్‌లో తెరుచుకున్న జామియా మసీదు 

Jamia Masjid Opened For Prayer After Long Time - Sakshi

శ్రీనగర్‌ : నగరంలోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్‌ 5 వ తేదీన జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన  తర్వాత భద్రతా కారణాల రీత్యా మసీదును మూసేశారు. మసీదు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద భద్రతా బలగాలను మొహరించారు. దాదాపు 135 రోజుల పాటు ఈ మసీదును మూసివేయగా, ఇన్ని రోజులు మూసేయడం మసీదు చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో ప్రధాన గేట్ల వద్ద భద్రతా సిబ్బందిని తొలగించారు. ఈ నేపథ్యంలో మసీదు నిర్వహణ చూసే కమిటీ మంగళవారం సమావేశమై మసీదులో ప్రార్థనలు చేయాలని నిర్ణయించింది. దాంతో బుధవారం మధ్యాహ్నం మసీదులో సామూహిక ప్రార్ధనలు చేశామని, దాదాపు 100 నుంచి 150 మంది ఈ ప్రార్థనలో పాల్గొన్నారని కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.

ప్రస్తుతం చలి ఎక్కువగా ఉ‍న్న దృష్ట్యా కేవలం మధ్యాహ్నం మాత్రమే ప్రార్థనలు నిర్వహిస్తామని కమిటీ సభ్యుడు తెలిపారు. నవంబర్‌ 22 నుంచి ఈ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ బలగాలు పెద్ద  సంఖ్యలో మొహరించడంతో ప్రార్థనలకు అనుమతించలేదు. ప్రస్తుత పరిణామంపై స్థానికుడు ఐజాజ్‌ అహ్మద్‌ హర్షం వ్యక్తం చేస్తూ.. చాలా మంది ఉదయం నుంచీ మసీదు ఆవరణను శుభ్రం చేయడంలో పాల్గొన్నారు. కొంతమంది ఉద్వేగానికి లోనై మసీదు స్తంభాలను ముద్దు పెట్టుకొన్నారు. చాలా రోజుల తర్వాత నమాజు చేయడంతో మేమంతా సంతోషంగా ఉన్నాం. మసీదు అంటే దేవుని ఇల్లు. దయచేసి ఇక్కడ కర్ఫ్యూ విధించవద్దని నా అభ్యర్థన అంటూ ముగించాడు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top