అంతరాత్మ ఒప్పుకోవట్లేదు.. వద్దు | Sakshi
Sakshi News home page

‘నమ్మ’ అవార్డుపై ఐపిఎస్‌ రూప లేఖ

Published Sun, Mar 25 2018 12:42 PM

IPS Roopa on Namma Bangalore Foundation Award - Sakshi

సాక్షి, బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చి వార్తల్లో నిలిచారు ఐపీఎస్‌ అధికారిణి రూప. ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనప్పటికీ నిర్భయంగా నిజాలను వెలుగులోకి తెచ్చి లేడీ సింగంగా ఆమె సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మరోసారి వార్తల్లో కెక్కారు.

నమ్మ బెంగళూరు ఫౌండేషన్‌ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఐదు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగిరీ కోసం కోసం 8 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసింది. ఈ లిస్ట్‌లో ఐజీ(హోమ్‌గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్) అయిన రూప పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంది. అయితే ఆ జాబితా నుంచి తన పేరును తొలగించాలని ఆమె కోరుతున్నారు.

ఈ మేరకు ఫౌండేషన్‌ సీఈవో ఎన్‌బీఎఫ్‌ శ్రీధర్‌ శెట్టికి ఆమె లేఖ రాశారు. ‘ జాబితాలో నా పేరును ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ అవార్డు స్వీకరించేందుకు నా మనస్సాక్షి ఒప్పకోట్లేదు. రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వ అధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే ప్రజల మనసులో మచ్చలేని అధికారులుగా ఉంటారు. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో నా అవార్డు అంశం రాజకీయం కావటం నాకు ఇష్టం లేదు’  అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

కాగా, నమ్మ బెంగళూరు ఫౌండేషన్‌ అధినేత బీజేపీ నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌. ఆయన తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీగా నెగ్గారు. ఈ నేపథ్యంలో ఆ ఫౌండేషన్‌ తరపున అవార్డు ద్వారా వివాదంలో చిక్కుకోవటం ఎందుకని రూప భావించినట్లు స్పష్టమౌతోంది.

Advertisement
 
Advertisement