శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌; పాసులు రద్దు

Intelligence Warns of Attack By JeM Terrorists High Alert in 7 States - Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌ విషం చిమ్మేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇంటలెజిన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల సహాయంతో కశ్మీర్‌ లోయతో పాటు పలు రాష్ట్రాల్లో బాంబు దాడులకు పాల్పడేందుకు దాయాది దేశ ఇంటలెజిన్స్‌ విభాగం ఐఎస్‌ఐ వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్‌ సభ్యులు సూత్రధారులుగా వ్యవహరించనున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్తాన్‌, పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఇంటలెజిన్స్‌ వర్గాలు సూచించాయి.

మరోవైపు స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాలు లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు భద్రతను ముమ్మరం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం నుంచి ఆగష్టు 20 వరకు హై అలర్ట్ విధించారు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టులోకి సందర్శకులకు అనుమతి నిరాకరించి.. అన్ని రకాల పాసులు రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులోకి వచ్చే వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top