దక్షిణాదికి ఉగ్రముప్పు

Inputs on likely terror attack in south India - Sakshi

సదరన్‌ కమాండ్‌ జీవోసీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ వెల్లడి

తిరుపతి, శ్రీహరికోట వద్ద భద్రత కట్టుదిట్టం   ఏపీ తీరం వెంట గస్తీ ముమ్మరం

పుణే/తిరువనంతపురం/అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని సదరన్‌ కమాండ్‌ జీవోసీ(జనరల్‌ ఆఫీసర్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌) లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ వెల్లడించారు. పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో సరిహద్దుల్లోని సర్‌ క్రీక్‌ లేన్‌ వద్ద ఇటీవల గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నాం. ఇవి దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించిన ఉగ్రవాదులవేనని అనుమానిస్తున్నాం.

దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందంటూ మాకు సమాచారం అందింది. దీతో సర్‌ క్రీక్‌ ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నాం’అని తెలిపారు. రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెన్నైలో మాట్లాడుతూ.. ఆర్మీ సదరన్‌ కమాండ్‌ పరిధిలోకి గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయి. అందుకే, జనరల్‌ సైనీ తెలిపిన ప్రకారం ఉగ్ర దాడి హెచ్చరికలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు గుజరాత్‌ లోని కొన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి’అని వివరణ ఇచ్చారు.

దక్షిణాదిన ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచినట్లు ఏపీ అదనపు డీజీపీ(శాంతి భద్రతలు) రవిశంకర్‌ అయ్యనార్‌ తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను మోహరించినట్లు వివరించారు. ‘కీలక సంస్థలు, వ్యవస్థ లున్న చోట పరిస్థితులపై తీరప్రాంత పోలీస్‌ స్టేషన్లతోపాటు ఎస్‌పీఎఫ్‌ విభాగాన్ని మా కంట్రోల్‌ రూం అప్రమత్తం చేస్తోంది. ముఖ్యం గా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటే శ్వరాలయం, శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం’అని అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానా శ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, జన సమ్మ ర్థం ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచాలని పోలీసు లను కేరళ డీజీపీ లోకనాథ్‌ బెహరా కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top