పాశ్చాత్య అభివృద్ధి పద్ధతి వల్లే ప్రకృతి నాశనం అవుతోందని ఆరెస్సెస్ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య అన్నారు. ఏకాత్మ మానవతా దర్శన్ తోనే అభివృద్ధి సాగాలని ఆయన చెప్పారు.
హైదరాబాద్: పాశ్చాత్య అభివృద్ధి పద్ధతి వల్లే ప్రకృతి నాశనం అవుతోందని ఆరెస్సెస్ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య అన్నారు. ఏకాత్మ మానవతా దర్శన్ తోనే అభివృద్ధి సాగాలని ఆయన చెప్పారు. రెండో రోజు ఆరెస్సెస్ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. భారత ప్రజల్లో క్షమాగుణం ఉన్నందువల్లే విదేశీయులు లూటీ చేశారని అన్నారు.
ప్రపంచంలో ఆర్థిక అసమానతలు, ప్రకృతి వైపరీత్యాలకు దీన్ దయాళ్ చెప్పిన ఏకాత్మ మానవతా దర్శనే సొల్యూషన్ అని ఆయన సూచించారు. మరో అరెస్సెస్ నేత నందకుమార్ మాట్లాడుతూ కేరళలో రాజ్యహింస పెరుగుతుందన్నారు. అక్కడ జరుగుతున్న హత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకోవాలని అన్నారు. హింసను అరికట్టి శాంతిని పునరుద్ధరించాలని నందకుమార్ సూచించారు. కమ్యూనిస్టుల చరిత్ర అంతా హత్యా రాజకీయాలేనని నందకుమార్ అన్నారు.